Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ జంటగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో గోపీచంద్ మాట్లాడుతూ, 'మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాను అనేది రేపు సినిమా చూస్తే మీకూ అర్థమవుతుంది. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సినిమా అంతా పగలబడి నవ్వడం ఖాయం' అని చెప్పారు.
'సినిమా వాళ్లకు మంచి రోజులు రావడం అంటే జనం థియేటర్స్‌కు వచ్చి ఆశీర్వదించడం. ఈ మధ్య విడుదలైన రెండు, మూడు సినిమాలకు అలాంటి మంచి రోజులు చూపించారు. నేను ఓటీటీ ఓనర్ అయ్యుండి కూడా సినిమాను తెరమీదే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంటర్టైన్మెంట్లోనే సందేశం ఇచ్చే దర్శకుడు మారుతి. గోపీచంద్ వంటి స్టార్ హీరోలు ముందుకొచ్చి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి సంప్రదాయం. ఇప్పుడు ఇండిస్టీకి చాలా అవసరం' అని మరో ముఖ్య అతిథి అల్లుఅరవింద్ అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, 'కేవలం నా టాలెంట్ నమ్మి మళ్లీ మళ్లీ నాకు అవకాశాలు ఇస్తున్న యు.వి.కాన్సెప్ట్స్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను' అని తెలిపారు.
'కరోనా తర్వాత అందరూ తెలియకుండానే ఒక భయంలోకి వెళ్లిపోతున్నారు. ఆ భయం మీద సినిమా ఎందుకు చేయకూడదు అనే ఐడియా నాకు వచ్చింది. ఐడియా వచ్చిన వెంటనే 20 రోజుల్లో కథ రాసి, 30 రోజుల్లో సినిమా తీశాను. ఓ పెద్ద సినిమా చేసేటప్పుడు మధ్యలో చిన్న సినిమా చేస్తానంటే ఏ నిర్మాత కూడా అంగీకరించడు. అలాంటిది నా నిర్మాతలు నాకు పూర్తి సహకారం అందించారు. ఈ సినిమా సరదాగా చేసినా, సీరియస్ విషయం ఉంది. నవంబర్ 4న థియేటర్లలో మీరు ఈ సినిమా చూసి కచ్చితంగా నవ్వుతారు. ఎంజారు చేస్తారని నమ్ముతున్నాను' అని దర్శకుడు మారుతి చెప్పారు.