Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటించిన తొలి సినిమా 'వర్జిన్ స్టోరి'. కొత్తగా రెక్కలొచ్చెనా.. అనేది క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంతో ప్రదీప్. బి అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. అగ్ర దర్శకుడు శేేఖర్ కమ్ముల ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా టీజర్, పాటలు చూశాను. చాలా బాగున్నాయి. విక్రమ్ చక్కగా నటించాడు. యూత్ ఆడియెన్స్‌కు ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను' అని అన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, 'ఇవాళ్టి యువత నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నారు. ఒక అమ్మాయి మంచి అబ్బాయి కోసం, అబ్బాయి మంచి అమ్మాయి కోసం, వాళ్ల స్నేహం, ప్రేమను కోరుకుంటున్నారు. అలాంటి వాళ్లందరి మనసులకు అద్దం పట్టే సినిమా అవుతుంది. యువత మనోభావాలను చూపించే అంశాలన్నింటినీ ఈ చిత్రంలో చక్కగా చూపించారు దర్శకుడు ప్రదీప్. త్వరలోనే థియేటర్స్‌లో మా చిత్రాన్ని విడుదల చేస్తాం' అని అన్నారు. లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ, 'నిజమైన ప్రేమ దక్కాలంటే వేచి చూడాలి. ఆ సహనం ఉన్న వాళ్లకే అది దక్కుతుందని చెప్పే చిత్రమిది. మా అబ్బాయి హీరోగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని చెప్పారు.
'నా జీవితంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను. విక్రమ్ లాంటి ప్యాషన్ ఉన్న హీరో నా ఫస్ట్ సినిమాకు దొరకడం అదష్టం' అని దర్శకుడు ప్రదీప్.బి అట్లూరి చెప్పారు.