Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే సంకల్పంతో, 58 రోజులు నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఈ తరానికి పరిచయం చేయాలనే ఆశయంతో 'పొట్టి శ్రీరాములు' పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా, కణ్మణి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. డా|| వెనిగళ్ళ రాంబాబు రచించిన 'తెలుగే మన ఆత్మబలం..' అంటూ సాగే పాటను సాలూరి వాసురావు సంగీత దర్శకత్వంలో సోమవారం రికార్డింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దర్శకుడు కణ్మణి మాట్లాడుతూ, 'ఇదొక పీరియడ్ ఫిలిం. హిస్టరీ ఉంది' అని చెప్పారు. నిర్మాత కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'నేటి తరానికి తెలియాల్సిన గొప్ప వ్యక్తి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నాం' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొట్టిశ్రీరాములు మనవరాళ్ళు శ్రీమతి రేవతి, శ్రీమతి అనురాధ పాల్గొన్నారు.