Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాతో మాటల రచయితగా పరిచయమైన గణేష్ రావూరి డైలాగ్స్ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయని చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో మాటల రచయిత గణేష్ రావూరి మంగళవారం తన ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'గతంలో 'సోలో బ్రతుకే సో బెటర్'తోపాటు ఒకట్రెండు చిత్రాలకు ఒక వెర్షన్ డైలాగ్స్ రాశాను. పూర్తిగా ఓ సినిమాకు వర్క్ చేసింది మాత్రం ఈ చిత్రానికే. నిర్మాత నాగవంశీ పిలిచి, నువ్వు బాగా రాస్తావని విన్నాను, మా కొత్త సినిమాకు ఒక డైలాగ్ వెర్షన్ రాసి ఇవ్వు, బాగుంటే చేద్దామని చెప్పారు. నేను రాసిన మాటలు నచ్చి ఓకే చేశారు. అలా 'వరుడు కావలెను' టీమ్‌లోకి వచ్చాను. ఈ సినిమాకు వస్తున్న స్పందన, మాటలు బాగున్నాయంటూ వచ్చే ప్రశంసలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇండిస్టీలో పెద్ద దర్శకుల దగ్గర నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి. నేను రాసిన మాటలు విని, నిర్మాత చినబాబు గారు నవ్వడం నాకు అతి పెద్ద ప్రశంస అనుకుంటాను. ఈ కథలో కామెడీ, ఎమోషన్స్ కలిసి ఉంటాయి. ఈ రెండింటికీ మాటలు బాగా కుదిరాయి. హీరో, హీరోయిన్ల పాత్రలకు ఓ పరిధి ఉంటుంది. ఆ పరిధి మేరకు మాటలు రాశాను. అయితే రచయితగా త్రివిక్రమ్ గారి శైలిని అనుసరించలేదు. ఆయనలా రాశానని ఎవరైనా చెబితే, దాన్ని పెద్ద గౌరవంగా భావిస్తా. త్రివిక్రమ్ గారు చిన్న పదాలతో మాటలు రాస్తారు. నేను మాత్రం ఆ పాత్ర ఏం మాట్లాడితే బాగుంటుందో, అలానే మాటలు రాశాను. దర్శకురాలు సౌజన్య, నిర్మాత నాగవంశీ కూడా అలాగే రాయమని ప్రోత్సహించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో దర్శకురాలు సౌజన్య సినిమా విజయంలో డైలాగ్స్‌కు మంచి క్రెడిట్ ఇచ్చారు. అది ఆమె గొప్పదనం అనుకుంటాను. నాకు కమర్షియల్ మూవీస్తోపాటు మాస్ చిత్రాలకూ మాటలు రాయాలని ఉంది. త్వరలో అలాంటి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను' అని తెలిపారు.