Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ హీరోగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. రవితేజ 70వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి 'రావణాసుర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'టైటిల్ పోస్టర్లో రవితేజ దశావతారాల్లో కనిపిస్తున్నారు. పది తలల రావణాసురుడిలా ఉన్నారు. ఇందులో పది రకాల విభిన్న పాత్రలను రవితేజ పోషించబోతున్నట్టు ఫస్ట్‌లుక్ చెప్పకనే చెబుతోంది. రామాయణంలో రావణాసురుడిది ఎంతో ముఖ్యమైన పాత్ర. పైగా విలన్ కూడా. కానీ ఈ చిత్రంలో రావణసుర కథ ఏంటి? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే. అలాగే హీరోలు అనేవాళ్లు ఉండరు అని పోస్టర్ మీద రాసి ఉంది. దీంతో ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రానికి రచయిత శ్రీకాంత్ విస్సా కథ అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారు. అలాగే ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఉండే ఈ సినిమా రవితేజ కెరీర్లో 70వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. ఆ వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడిస్తారు' అని చెప్పారు.