Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పుష్ప: ది రైజ్' సినిమా నుంచి లేటెస్ట్గా వచ్చిన ఓ సరికొత్త అప్డేట్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది. ఇందులో మంగళం శ్రీనుగా నటిస్తున్న సునీల్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ దర్శక, నిర్మాతలు ఆదివారం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇన్నేండ్లుగా కమెడియన్‌గా మాత్రమే చూసిన సునీల్‌లోని మరో కోణాన్ని దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించ బోతున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సునీల్ గెటప్‌కి తగ్గట్టుగానే.. రాక్షసుడిని పరిచయం చేస్తున్నాం అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. 'చూడగానే భయపడే రూపంతో ఉన్న సునీల్ క్యారెక్టర్ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్లో ఉన్న ఇంపాక్ట్ కంటే, సినిమాలో 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. 'అల వైకురఠపురంలో' వంటి ఇండిస్టీ హిట్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా, 'రంగస్థలం' వంటి ఇండిస్టీ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు' అని చిత్రయూనిట్ పేర్కొంది.