Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం 'రాజా విక్రమార్క'. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించారు. అగ్ర దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ మెరవబోతున్నారు.
ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శీ సరిపల్లి సోమవారం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
మీ నేపథ్యం?
- మాది విజయవాడ. యూనివర్సల్ స్టూడియోస్‌లో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ చేశా. నాలుగేళ్లు అక్కడ ఇండిపెండెంట్ సినిమాలకు పని చేసిన తర్వాత అమెరికా నుంచి ఇండియా వచ్చా. వీవీ వినాయక్ గారి దగ్గర 'నాయక్', 'అల్లుడు శీను' తదితర సినిమాలకు పని చేసి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నా.
ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది?
- ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన ఓ కుర్రాడు, క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు?, ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? ఏమైంది? అనేది సినిమా. ఎంటర్టైన్మెంట్, యాక్షన్... అన్నీ ఉంటాయి. యాక్షన్ కొత్తగా, కథలో భాగంగా ఉంటుంది. వీటిని 'మిషన్ ఇంపాజిబుల్' స్ఫూర్తిగా తీశా. ఇందులో ఎన్ఐఏలో జాయిన్ అయిన కుర్రాడిగా కార్తికేయ కనిపిస్తారు.
ఈ కథలో ప్రత్యేకత ఏంటి?
- ఎన్ఐఏ నేపథ్యంతో ఇప్పటికే వచ్చిన సినిమాల్లో చూపించిన పెద్ద పెద్ద సమస్యలు నేను చూపించలేదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎన్ఐఏ ఏజెంట్లు తీవ్రవాదులు మీద మాత్రమే కాదు, లోకల్‌గానూ వర్క్ చేస్తారు. దేశంలోని ఓ సమస్య మీద మా సినిమాలోని ఎన్ఐఏ పోరాడుతుంది.
ఎన్ఐఏ నేపథ్యం అంటున్నారు. మరి వినోదానికి ఎలాంటి స్కోప్ ఉంది?
- సిట్చ్యువేషనల్ కామెడీ ఉంటుంది. క్యారెక్టర్లు జోకులు వేయవు. కాని ఆ సందర్భాలు చూస్తే ప్రేక్షకులకు నవ్వొస్తుంది.
తాన్యా రవిచంద్రన్ క్యారెక్టర్ గురించి?
- హోమ్ మినిస్టర్ కూతురిగా కనిపిస్తారు. క్లాసికల్ డాన్సర్ కూడా! ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి. కథకి మెయిన్ పిల్లర్. అలాగే పశుపతి, తనికెళ్లభరణి, సాయికుమార్, సుధాకర్ కోమాకుల... ప్రతి ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది.
ప్రశాంత్ ఆర్. విహారిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడానికి కారణం?
- న్యూ ఏజ్ మ్యూజిక్ కోసమే. ఆయన ఇప్పటివరకూ ఇటువంటి జోనర్ సినిమా చేయలేదు. ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. రీ - రికార్డింగ్ కూడా బాగా చేశారు.
ఎలాంటి సినిమాలు చేయటాన్ని ఇష్టపడతారు?
- ఏ జోనర్ సినిమా చేసినా, అందులో ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటా. నెక్ట్ సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది.
హీరో కార్తికేయతో పని చేయటం ఎలా ఉంది?
- సూపర్‌గా ఉంది. ఓ మంచి కథని, మంచి హీరోతో చేశాననే సంతృప్తి ఉంది. ఈ చిత్రానికి 'రాజా విక్రమార్క' టైటిల్‌ని తనే సజెస్ట్ చేశారు. ఇందులో ఆయన పాత్ర నేపథ్యం సీరియస్‌గా ఉన్నా, ఆయన చేసే పనులు, తీరు మాత్రం ఫుల్ కామెడీని జనరేట్ చేస్తాయి. మా నిర్మాతలు ఆదిరెడ్డి, '88 రామారెడ్డి' ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి సినిమా దర్శకుడికి ఇటువంటి నిర్మాతలు, కార్తికేయ లాంటి హీరో దొరకటం చాలా లక్.