Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్గా తమన్నా నటించనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'సైరా నరసింహారెడ్డి' తర్వాత చిరుతో కలిసి తమన్నా నటిస్తున్న రెండో చిత్రమిది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
చిరంజీవికి సంబంధించి లుక్ టెస్ట్ చేశామని సోషల్ మీడియా ద్వారా సోమవారం దర్శకుడు మెహర్ రమేష్ ప్రకటించారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈనెల 11న ఉదయం 7:45 గంటలకు నిర్వహించనున్నారు. అలాగే ఈనెల 15 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.