Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'నయీం డైరీస్'. వశిష్ట సింహ హీరోగా నటించిన ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించారు. సీఏ వరదరాజు నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. యువ దర్శకుడు సంపత్ నంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది. ఫిక్షనల్ స్టోరీస్ చేసేకంటే, ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్‌తో సినిమాలు చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో నయీంగా నటించిన వశిష్ట సింహా మా 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'పలు సినిమాలు చేసిన అనుభవం, ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా ఈ సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ అవుతుంది' అని హీరో వశిష్ట సింహ చెప్పారు. నిర్మాత సీఏ వరదరాజు మాట్లాడుతూ, 'రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న నాకు నిర్మాతగా ఇది మొదటి సినిమా. దర్శకుడు బాలాజీ 20 ఏళ్లుగా పరిచయం. ఆయన చెప్పిన నయీం కథ వినగానే యాక్షన్ బ్యాక్ డ్రాప్లో బాగుంటుందని చేశాం. నయీం పాత్రకు మేం అనుకున్న దానికంటే వశిష్ట బాగా యాక్ట్ చేశారు' అని తెలిపారు.
దర్శకుడు దాము బాలాజీ మాట్లాడుతూ, 'నా మీద నమ్మకంతో నిర్మాత వరదరాజు ఈ సినిమా చేశారు. 'కిల్లింగ్ వీరప్పన్' సినిమాకు స్క్రిప్ట్ రచయితగా పనిచేశాను. ఐదేళ్ల కిందట నయీం ఎన్ కౌంటర్ జరిగినప్పుడు అదో సెన్సేషన్ అయ్యింది. అప్పుడు నయీం గురించి స్టడీ చేశా. నయీం అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు విప్లవకారుడిగా నేనూఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నాను. దీంతో ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో నాకు క్షుణ్ణంగా తెలుసు. వాటిని డ్రమటిక్‌గా ఈ సినిమాలో చూపించాను. నయీం లొంగిపోయిన తర్వాత పోలీసులు, రాజకీయ నాయకులు అతన్ని వాడుకుని నక్సలైట్లను అంతమొందించారు. నయీం ఎందుకు క్రిమినల్‌గా మారాడు?, అతన్ని మించిన క్రిమినల్స్ సొసైటీలో ఎవరు అనేది సినిమాలో డీటైల్డ్‌గా చూపిస్తున్నాం' అని చెప్పారు.