Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ శనివారం మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
- తాత (అక్కినేని నాగేశ్వరరావు) గారు ఎంత ఇచ్చారు. దాన్ని చిన్న మామ (నాగార్జున గారు) ఎంతలా పెంచారు అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాతయ్య ఉన్నపుడు నాకు ఆ విలువ తెలియలేదు. అన్నపూర్ణ స్టూడియోను తాతగారు కడితే, నాగ్ మామ దాన్ని నిలబెట్టారు.
- ఈ కథ విన్నప్పుడు నేను చాలా నవ్వాను. నేను నవ్వానంటే ఓ పది మంది నవ్వుతారనే నమ్మకంతో ఈ సినిమా చేశాను. మన జోకులు, మన నేటివిటీని చాలా మిస్ అవుతుంటాం. ఈ కథలో అవన్ని ఉంటాయి. 'ఏప్రిల్ 1న విడుదల', 'లేడీస్ టైలర్' వంటి సినిమాలు చూశాం. పెద్ద వంశీ గారి సినిమాలా ఓ మంచి తెలుగు సినిమా చూశామనే ఫీలింగ్ వస్తుంది.
- పెద్ద జీవితం అనుకున్న దాంట్లో ఓ చిన్న స్పీడు బ్రేకర్, దాన్ని హీరో ఎలా సరిదిద్దుకున్నాడు?, ప్రతీవాడు ప్రెసిడెంట్ అనుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ సత్తా ఉండాలి కదా...అలా సరదా, సరదాగా సాగేదే ఈ సినిమా. అందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది.
- రాజ్ తరుణ్‌లో కామిక్ టైమింగ్, వ్యగ్యం.. అన్నీ ఉంటాయి. ఈ కథ విన్న తర్వాత రాజ్ తరుణ్ మాత్రమే కనిపించాడు. అందుకే అతన్ని ఎంపిక చేశా. తను నూటికి నూరుశాతం న్యాయం చేశాడు.
- చిన్న సినిమాలు లేకపోతే ఇండిస్టీ ఉండదు. పైగా వీటి వల్ల కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాలను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. అందరూ చిన్న సినిమాలు తీయాలి. చిన్న సినిమాని హిట్ చేయగలిగితే వచ్చే సంతప్తి మాటల్లో చెప్పలేం.ఈ సినిమాకీ ఓటీటీలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇది థియేటర్ సినిమా. థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది.
- అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇప్పుడు నాలుగు టీవీ సీరియళ్లు, 4 వెబ్ సిరీస్‌లు, ఒక చిన్న సినిమా, ఒక పెద్ద సినిమా నిర్మాణం జరుగుతోంది.
నాకు అన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలే వస్తున్నాయి. ఎన్ని సార్లు అదే పాత్రను చేయాలి. అందుకే ఒప్పుకోవడం లేదు. 'గూఢచారి 2'లో మంచి పాత్ర ఇస్తే, తప్పకుండా చేస్తాను. ఫ్యూచర్లో దర్శకత్వం వహిస్తానేమో. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా సినిమాలు తీయాలి. కొత్త కంటెంట్ రావాలి. ప్రేక్షకులు మారారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా మారడం లేదు. మూస ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అందరూ కంటెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. అది స్టుపిడ్. కంటెంట్ కాదు.. మంచి కథలను చెప్పండి.