Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ కథానాయకుడు శింబుకి టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. తెలుగునాట 'మన్మథ' సినిమా సాధించిన విజయంతో శింబు సినిమాల కోసం అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
చాలా గ్యాప్ తర్వాత ఆయన 'ది లూప్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన తమిళ చిత్రం 'మానాడు'. ఈ చిత్రాన్ని 'ది లూప్' టైటిల్‌తో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్బింగ్ చేశారు. ఈనెల 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కథానాయకుడు శింబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, 'ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. సైన్స్ ఫిక్షన్ని జోడించి తెరకెక్కించాం. స్వార్థ రాజకీయ నాయకులు తమ ఉనికి చాటుకోవడం కోసం సామాన్యుల్ని ఎలా వాడుకుంటున్నారో ఈ కథలో చెప్పాం. దానికి టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ జోడించాం. ఓ యువకుడి జీవితంలో ఓ ఘటన మళ్లీ మళ్లీ ఎదురవుతుంటుంది. అలా ఎందుకు జరుగుతోంది? ఆ యువకుడు ఆడిన రాజకీయ చదరంగం ఎలాంటిది? అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎవరి జీవితంలోనూ ఇలా జరిగి ఉండకపోవొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ ఈ కథ కనెక్ట్ అవుతుంది. సౌత్‌లో ఈ తరహా కథలతో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. అలాగే దర్శకుడు వెంకట్ ప్రభు కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో తెరకెక్కించారు. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎస్.జె.సూర్య నటించారు. మా ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీలాంటి పోటీ జరుగుతుంటుంది. హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని పాత్ర చాలా కీలకం. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తీస్తుండటంతో చాలా రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. అందుకే మధ్యలోనే సినిమాని ఆపేయాల్సి వచ్చింది. ఈ సినిమాని పూర్తి చేయడానికి దాదాపు మూడేండ్ల సమయం పట్టిందంటే, ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో వేరే చెప్పక్కర్లేదు. ఆ కష్టాలు గుర్తుకురావడంతో ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీటీపర్యంతమయ్యాను. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన 'ది లూప్' చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్‌గారికి, బన్నీ వాసుకు మనస్ఫూర్తిగా కతజ్ఞతలు' అని తెలిపారు.
ఈ సినిమాకి ముందు నా కెరీర్ చాలా డౌన్లో ఉంది. నన్ను నేను మార్చుకోవాలని 27 కేజీల బరువు తగ్గాను. ఆహారపు అలవాట్లు మార్చుకున్నా. మద్యపానానికి దూరంగా ఉన్నా. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా. ఇకపై చేసే ప్రతి సినిమాని నిజాయితీగా చేస్తా. అలాగే నా ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తా. మంచి కంటెంట్ ఉన్న కథ దొరికితే తెలుగులో స్ట్రయిట్ సినిమాలో నటిస్తాను.