Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పటాస్'తో దర్శకుడిగా ఆరంభమైన ప్రయాణం 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్స్‌తో అటు పరిశ్రమలోను, ఇటు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి.
అతి తక్కువ కాలంలోనే పక్కా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచారు. ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాతో మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్న అనిల్ రావిపూడి పుట్టినరోజు నేడు (మంగళవారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
డైరెక్టర్‌గా ఇది నా ఆరవ బర్త్ డే. ఇంకా ఎంతో ప్రయాణించాల్సి ఉంది. బర్త్ డే అయినప్పటికీ 'ఎఫ్ 3' సెట్లో పని చేస్తున్నాను. అదే ఈ బర్త్ డే ప్రత్యేకత. 'ఎఫ్ 2' సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఎంజారు చేశారో, అంతకు మించి 'ఎఫ్3'ని ఎంజారు చేస్తారు. ఈసారి కూడా సంక్రాంతికి వస్తే హ్యాట్రిక్ అయ్యేది. కానీ భారీగా సోలో రిలీజ్ చేయాలని సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాం.
'ఎఫ్ 2' అనేది మగాళ్లందరి బయోపిక్. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఫ్రస్టేట్ అవుతుంటారు. పని చేసే చోట, ఇంట్లో ఇలా ఎక్కడైనా సరే ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. దానికి ఫ్రాంచైజీగా 'ఎఫ్ 3' రావడం ఆనందంగా ఉంది. 'ఎఫ్ 2' భార్యాభర్తల చుట్టూ తిరిగితే, 'ఎఫ్ 3' డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాత పాత్రలతోపాటు సునీల్, మురళీ శర్మ పాత్రలను కొత్తగా యాడ్ చేశాం. వీళ్ళ పాత్రలు సినిమాకి కీలకంగా ఉంటూ నవ్వుల్ని పూయిస్తాయి.
'ఎఫ్3' సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇంకా రెండు పాటలు మిగిలి ఉన్నాయి. కొంత టాకీ పార్ట్ కూడా ఉంది. డిసెంబర్ కల్లా టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. నా ప్రతీ సినిమాలో ఏదో ఒక మ్యానరిజమ్ ఉంటూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం దాన్ని బ్రేక్ చేశాం. అంతేగా అంతేగా, వెంకీ ఆసనం అక్కడక్కడా ఉంటుంది. అయితే ఈ చిత్రంలో సందర్భానికి రియాక్ట్ అయి చేసే యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక మ్యానరిజం పెడితే జనాలు కూడా ఇంతే కదా? అని అనుకుంటారు (నవ్వుతూ). అందుకే ఈసారి వెంకటేష్ గారికి రేచీకటి, వరుణ్ తేజ్‌కు కొంచెం నత్తి పెట్టాం. ఇవి ఎక్కడ అవసరమో అక్కడే వచ్చి, అందరినీ నవ్విస్తుంటాయి.
నా చుట్టు పక్కల చూసిన పాత్రలనే సినిమాలో పెడతాను. 'ఎఫ్3'లో అందరూ కనెక్ట్ అయ్యే ఓ ట్రాక్ ఉంటుంది. చిన్న పిల్లలతో నేను నా ఇంట్లో చూసిన అనుభవాలను పెట్టాను. థియేటర్లో ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తే, అరే మా ప్రాబ్లమ్స్ కూడా ఇవే కదా అని కచ్చితంగా ఫీలవుతారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. వీళ్ళిద్దరూ 'ఎఫ్2'లో మాదిరిగానే ఈ సినిమాలోనూ రెచ్చిపోయారు. వీళ్ళ యాక్టింగ్‌కి థియేటర్లో పడి పడి నవ్వుకోవడం ఖాయం. రీసెంట్గా వెంకటేష్‌గారు ఫస్టాఫ్ చూసి, నేనొక్కడినే బాగా చేశానని అనుకున్నా. కానీ అందరూ ఇరగ్గొట్టేశారన్నారని అప్రిషియేట్ చేశారు. ఈసారి ప్రతీ పాత్ర హైలెట్ అవుతుంది. అన్నింటికి మించి ప్రతి పాత్రకు ఉన్న పర్పస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
'ఎఫ్ 3' లో పాన్ ఇండియన్ కంటెంట్ ఉంటుంది. బాలకష్ణ గారితో చేయబోయే సినిమా ఆయన స్టైల్‌కు తగ్గట్టుగా ఉంటుంది. ఆయనతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాని చేయలేం. ఆయన శైలి వేరు. 'పటాస్'లా పూర్తిగా ఆయన మార్క్‌లోనే సినిమా చేస్తాను. ప్రస్తుతం బాలీవుడ్‌కి ఎంట్రీ, అలాగే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలకి సంబంధించి ప్లాన్ లేదు.