Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం గ్రాండ్‌గా నిర్వహించారు. అగ్ర దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, 'బోయపాటి- బన్నీ కాంబినేషన్లో 'సరైనోడు' చేశాను. అది సూపర్ హిట్. బాలయ్యతో ఇది రెండో సినిమా. 'శ్రీరామ రాజ్యం'లో లక్ష్మణుడిగా చేశాను. ఇప్పుడు రావణసురుడిగా చేస్తున్నాను. బాలయ్యతో విలన్‌గా చేయడం అంత ఈజీ కాదు. ఆయన ఎనర్జీని తట్టుకోవడం కష్టం. ఆయన డైలాగ్స్ హై ఓల్టేజ్‌లో ఉంటాయి. బాలయ్య నన్ను బాగా ప్రోత్సహించారు' అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, 'ఇండిస్టీకి శివుడి లాంటి మనిషి బాలయ్య. బాలయ్య ట్రాన్స్ఫార్మర్ అయితే, ఆయనకు కరెక్ట్ వోల్టెజ్ కరెంట్ ఇచ్చేది బోయపాటి. గత 48 రోజులుగా ఈ సినిమా కోసమే పని చేస్తున్నాను. థియేటర్లో సినిమా చూసేటప్పుడు ఫుల్‌గా ఎంజారు చేస్తారు' అని అన్నారు.
'కరోనా వల్ల థియేటర్లలో సినిమా చూడాలనే ఆనవాయితికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్‌ని మళ్లీ 'అఖండ'తో ప్రారంభిస్తున్నాం. ఆ లెగసినీ 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' ముందుకు తీసుకెళ్తాయి. పాత రోజులు మళ్లీ వస్తాయి. ఈ సినిమాతో జాతర మొదలవుతుంది' అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ,'21 నెలలుగా మా వెనక ఉన్న మా నిర్మాతకు థ్యాంక్స్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి హెల్ఫ్ చేసింది బన్నీ బాబు. ఆ తర్వాత కెరీర్ స్టార్ చేసి, ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య బాబు. ఇద్దరి ముందు ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో నేను గెలవాలని అనుకోలేదు. సినిమా గెలవాలని అనుకున్నాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. గుండె మీద చేయి వేసుకుని, ఓ మంచి సినిమా చూశామని సంతోషంగా చెప్పుకునేలా ఉండే సినిమా ఇది ' అని తెలిపారు.
ఇది ఏ ఒక్కరి సినిమా అని అనుకోవడం లేదు. అందరికి శివ పార్వతుల ఆశీస్సులు ఉండాలి. మనం పలికే అక్షరంలో ఉండే బలం.. ఒక్కో అక్షరం కలిపితే మంత్రం అవుతుంది. ఆహాలో చేసినట్టుగానే.. ఓ భక్తి చానల్ కూడా మొదలుపెడదామని అనుకుంటున్నాం. వినుట, స్మరించుట, సేవించుట, కీర్తించుట, పూజించుట, నమస్కరించుట, పరిచరియాలు చేయూట, స్నేహ భావంతో ఉండుట, మనో వాక్కాయాలను భగవంతుడికి అర్పించుట.. ఇదే అఖండ సినిమా. భారతదేశంలో ఉన్న భక్తిని, ఈ సినిమాతో ఇంకా బతికిస్తునందుకు ఆనందంగా ఉంది. శ్రీకాంత్‌కు హ్యాట్సాఫ్. నటన అంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం. ఇద్దరు తమ్ముళ్లు.. అల్లు అర్జున్, శ్రీకాంత్‌ను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. మా సినిమాతోపాటు 'పుష్ప', రాజమౌళి గారి రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్', చిరంజీవి గారు నటించిన 'ఆచార్య'.. ఇలా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. వాటికి రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరించాలి.
- బాలకృష్ణ
బోయపాటి గారు ఈ ఆడిటోరియంకే కాకుండా మొత్తం ఇండిస్టీకి ఊపు తీసుకొచ్చారు. డిసెంబర్ 2 నుంచి అన్ని థియేటర్లు అరుపులు, కేకలతో నిండిపోవాలి. బాలయ్య బాబు ఒక ఐటమ్ బాంబు. ఆయన్ని ఎలా ప్రయోగించాలో శ్రీనుకు బాగా తెలుసు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి.
- రాజమౌళి
బాలకష్ణగారు ఈ లెవెల్లో ఉండటానికి రెండు కారణాలు. ఒకటి.. ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్. రెండోది ఆయన వాచకం.. ఆయనలా డైలాగ్ చెప్పేవారు ఎవ్వరూ లేరు. రీల్లో అయినా రియల్‌లో అయినా ఆయన రియల్‌గానే ఉంటారు. బాలయ్య, బోయపాటి కాంబోలో సినిమా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ చూశాను. పూనకాలు వచ్చేలా ఉంది. అఖండమైన హిట్ సాధించి, అఖండ జ్యోతిలా తెలుగు సినిమాకు వెలుగునివ్వాలి.
- అల్లు అర్జున్