Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావత్ భారతదేశం గర్వించ దగ్గ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (73) ఇకలేరు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఆదివారం రాత్రి కన్ను మూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు విజరు, అజరు ఉన్నారు. గత వారం కరోనా బారిన పడిన శివశంకర్ మాస్టర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా 75 శాతం ఊపిరితిత్తులు దెబ్బ తినటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో చిరంజీవి, ధనుష్ తదితరులు ఆర్థికంగా అండగా నిలిచినప్పటికీ, సోనూసూద్, మంచు విష్ణు వంటి వాళ్లు వైద్యులతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ శివ శంకర్ మాస్టర్‌ను కాపాడుకోలేకపోవడం బాధాకరం.
1948, డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన శివశంకర్ మాస్టర్ తెెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో కలిపి 10 భాషల్లో దాదాపు 800 చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రఫీ అందించారు. 1975లో 'పాట్టు భరతమమ్' చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 'కురువికూడు' చిత్రంతో నత్య దర్శకుడిగా మారారు. సరళమైన, భావయుక్తమైన నృతరీత్యుల్ని సమకూర్చటంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు.
రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'మగధీర' సినిమాలోని 'ధీర ధీర...' పాటకు సమకూర్చిన నృత్యరీతులకు శివశంకర్ మాస్టర్‌కు జాతీయ ఉత్తమ కొరియోగాఫ్రర్గా ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. అలాగే 'బాహుబలి' చిత్రంలో ఆయన కంపోజ్ చేసిన పాటలకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించింది. ఉత్తమ డాన్స్‌మాస్టర్‌గా నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డులను సొంతం చేసుకున్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, విజరు, సూర్య.. ఇలా అన్ని భాషలకు చెందిన అగ్ర హీరోల దగ్గర్నుంచి నేటి యువ కథానాయకులతో ఆయన పని చేశారు.
డాన్స్ మాస్టర్‌గానే కాకుండా నటుడిగానూ పలు భాషా చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే తెలుగులో 'నాగభైరవి', 'జ్యోతి', 'నెం.1 కోడలు' వంటి తదితర సీరియల్స్‌లో నటించడంతోపాటు ఆట జూనియర్స్, ఢ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు.
ఆత్మీయుడిని కోల్పోయా : చిరంజీవి
'శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. వ్యక్తిగతంగా, వత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలు అందించారు. 'ఖైదీ' సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్‌గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు. అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. చరణ్ బ్లాక్ బస్టర్ 'మగధీర' సినిమాలోని 'ధీర ధీర' పాటకు శివశంకర్ మాస్టర్ జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా 'ఆచార్య' సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మతి కేవలం నత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు' అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు జరుపనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.