Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన్ని, ఆయన కలం నుంచి జాలువారిన పాటల్ని గుర్తుచేసుకుంటూ సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అత్యంత ప్రతిభావంతులు. ఆయన రచనల్లో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి సీతారామశాస్త్రి ఎంతగానో కషి చేశారు.
- ప్రధాని మోదీ
తొలి సినిమా 'సిరివెన్నెల' పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని తెలుగు భాషకు పట్టం కడుతూ ఆయన రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించేవారిలో నేనూ ఒకడిని.
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం తెలుగు చలన చిత్రరంగానికి, సంగీత, సాహిత్య అభిమానులకు తీరని లోటు.
- కేసీఆర్, తెలంగాణా ముఖ్యమంత్రి
తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు.
- వై.ఎస్.జగన్, ఏపీ ముఖ్యమంత్రి
ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయాననిపించింది. ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయా.
- దర్శకుడు కె. విశ్వనాథ్
వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన రచయిత సిరివెన్నెల. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. గుండె బరువెక్కిపోతోంది. భౌతికంగా ఆయన దూరమైనా తన పాటలతో బతికే ఉన్నారు. - చిరంజీవి
సినీ పాటకు సాహితీ గౌరవం కల్పించిన వ్యక్తి సిరివెన్నెల. తెలుగు పాటను దశదిశలా వ్యాపింపజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
- బాలకష్ణ
సిరి వెన్నెల నా సన్నిహితుడు. సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది.
- మోహన్ బాబు
ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'దోస్తీ' మ్యూజికల్ వీడియోలో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. - రాజమౌళి
'సిరివెన్నెల' భౌతికకాయాన్ని అభిమానాల సందర్శానార్థం బుధవారం ఉదయం ఫిల్మ్ఛాంబర్లో ఉంచి, తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
'సిరివెన్నెల'కు భార్య పద్మావతి, కుమారులు యోగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు ఉన్నారు. యోగేశ్వర్ సంగీత దర్శకుడిగా, రాజా నటుడిగా సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు.