Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినిమా పాటకి విశ్వ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి (66) ఇకలేరు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నవరసాల సమ్మేళంగా ఎన్నో అత్యద్భుతమైన పాటలతో ప్రేక్షకుల మనసులపై చెరగని సంతకం చేసిన పాటల రారాజు 'సిరివెన్నెల'గా ఎప్పటికీ సజీవంగానే ఉంటారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. మూడున్నర దశాబ్దాలుగా ఎన్నో ఆణిముత్యా ల్లాంటి పాటలతో ఆబాలగోపాలాన్ని అలరించిన సినీ పాటల దిగ్గజం 'సిరివెన్నెల' జీవిత విశేషాల సమాహారం..
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా..
చెంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్ చేసిన తర్వాత తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్‌లో చేరారు. ఇంగ్లీష్ సరిగా రాక పోవడం, కాలేజీ పరిస్థితులు నచ్చక ఎంబీబీఎస్ని మధ్యలోనే ఆపేశారు. పదవ తరగతి అర్హతపై బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం రావటంతో రాజ మహేంద్రవరంలో కొన్నాళ్లు పనిచేశారు.
సోదరుడి ప్రోత్సాహంతో..
చిన్నప్పటి నుంచి గాయకుడు కావాలనేది సీతారామశాస్త్రి కల. అయితే అందుకు తాను అర్హుడిని కాదనే విషయాన్ని గ్రహించి, ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడైన ఆయన తనకి తెలిసిన పదాలతో దేశభక్తి పద్యాలను, గీతాలను రాయటం ఆరంభించారు. ఆయనలో మంచి కవి ఉన్నాడనే విషయాన్ని ఆయన సోదరుడు గమనించి, ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే ఆయన్ని సినీ రంగం వైపు అడుగులు వేసేలా చేసింది.
మలుపు తిప్పిన 'సిరివెన్నెల'..
భరణితో పేరుతో కథలు, పద్యాలు, పాటలు రాసే క్రమంలో ఆయన గురించి దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్‌కి తెలిసింది. బాలకృష్ణ నటించిన 'జనని జన్మభూమి' (1984) చిత్రానికి పాటలు రాసే అవకాశాన్ని విశ్వనాథ్ ఇచ్చారు. ఆ తర్వాత 1986లో ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన 'సిరివెన్నెల' చిత్రంలోని అన్ని పాటలను రాసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ చిత్రం కోసం రాసిన ప్రతి పాట అశేష ప్రేక్షకలోకాన్ని విశేషంగా అలరించాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా సీతారామశాస్త్రి ప్రతిభ ఏంటో ప్రపంచానికి తెలిసింది. దీంతో ఈ సినిమా టైటిలే ఆయన ఇంటి పేరుగా మారి 'సిరివెన్నెల'గా తన సుమధుర పాటలతో అందర్నీ ఓలలాడించారు. ఈ సినిమాలోని 'విధాత తలుపున..' పాటకు ఆయన తొలిసారి ఉత్తమ గీత రచయితగా ప్రతిష్టాత్మక నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు.
సందర్భం ఏదైనా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పాటల్ని రాయటంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. అదే సమయంలో భారీ పద ప్రయోగాలతో మేధావుల్ని సైతం అబ్బురపరచిన సందర్భాలెన్నో ఉన్నాయి.
800 సినిమాలు.. 3 వేలకి పైగా పాటలు
'సిరివెన్నెల'తో ఆరంభమైన పాటల ప్రస్థానం మూడున్నర దశాబ్దాలుగా నిరంతరాయంగా సాగింది. 1984 నుంచి 2021 వరకు 800 సినిమాల్లో దాదాపు మూడు వేలకి పైగా పాటలు రాశారు. ఆయన పాటలు నవరసాలకు కేరాఫ్‌గా నిలిచాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన గీత రచయిత మాత్రమే కాదు సమాజ సేవకుడు కూడా. దేశభక్తిని రగిల్చే స్ఫూర్తిదాయక పాటలు, ప్రస్తుత సమాజానికి అద్దంగా నిలిచిన ఎన్నో పాటలు ఆయన కలం నుంచి జాలు వారాయి.
నవరసాల సమాహారం
'రామ బాణం ఆపింది రావణ కాష్టం, కష్ణ గీత ఆపింది నిత్య కురుక్షేత్రం.. నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని, అగ్గి తోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని', 'మంగళ సూత్రం అంగడి సరుకు, కొనగలవా చెయిజారాకా', 'ముసుగువేయోద్దు మనసు మీద', 'ఆది భిక్షువు వాడినేమి అడిగేది', 'ఏటో వెళ్లిపోయింది మనసు..', 'అపురూపమైనదమ్మ ఆడజన్మ', 'నమ్మకు నమ్మకు ఈ రేయిని', 'జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..', 'జరుగుతున్నది జగన్నాటకం..' అంటూ అన్ని రకాల భావోద్వేగాల్ని తనదైన పాటల్లో పలికించి, తెలుగు ప్రజలను అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 'కళ్ళు' చిత్రంలోని 'తెల్లారి లెగండోరు..' పాటతో గాయకుడిగా శ్రోతల్ని మెప్పించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ తెరకెక్కించిన 'సిరివెన్నెల', 'శృతిలయలు', 'స్వయంకృషి', 'స్వర్ణకమలం', 'ఆపద్భాంధవుడు', 'స్వాతి కిరణం', 'శుభసంకల్పం' వంటి చిత్రాలకు సిరివెన్నెల ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. విశ్వనాథ్ తర్వాత రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీ, త్రివిక్రమ్ సినిమాలకు ఎక్కువగా పాటలు రాశారు. వీరితోపాటు అన్నపూర్ణ స్టూడియోస్, సుమంత్ ఆర్ట్స్, ఉషాకిరణ్ మూవీస్ సంస్థలు నిర్మించిన ఎన్నో సినిమాలకు సిరివెన్నెల పాటలు రాశారు.
కె.వి.మహదేవన్, ఇళయరాజా, రమేష్‌నాయుడు, రాజ్ -కోటి, హంసలేఖ, చక్రవర్తి, బప్పిలహరి, ఎం.ఎం.కీరవాణి, శ్రీ, ఆర్.డి.బర్మన్, మాధవపెద్ది సురేష్, ఏ.ఆర్.రెహ్మాన్, ఎస్.ఏ.రాజ్‌కుమార్ వంటి తదితర ప్రముఖు సంగీత దర్శకులతో 'సిరివెన్నెల' పని చేశారు.
11 నంది పురస్కారాలు
'విధాత తలపున..' (సిరివెన్నెల, 1986), 'తెలవారదేమో సామి..' (శృతిలయలు- 1987), 'అందెల రవళి..' (స్వర్ణకమలం-1988), 'సురాజ్యమవలేని..' (గాయం - 1993), 'చిలకా ఏ తోడు లేక..' (శుభలగం - 1994), 'మనసు కాస్త కలత..' (శ్రీకారం - 1995), 'అర్థశతాబ్దపు..' (సింధూరం-1997), 'దేవుడు కరుణిస్తాడని..' (ప్రేమకథ - 1999), 'జగమంత కుటుంబం నాది..' (చక్రం - 2005), 'ఎంత వరకు ఎందుకొరకు..' (గమ్యం - 2008), 'మరీ అంతగా...' (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు).. పాటలకు 11 నంది పురస్కారాలను సిరివెన్నెల సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా పాటకు ఆయన చేసిన విస్తృత సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రతిష్టాత్మక పద్యశ్రీ పురస్కారంతో సముచితంగా గౌరవించింది. 'సిరివెన్నెల' చివరిగా నాని కథానాయకుడిగా నటించిన 'శ్యామ్‌సింగరారు' చిత్రం కోసం రెండు పాటలు రాశారు.