Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న పాత్రలతో, వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు షానీ సుపరిచితుడు. బ్లాక్‌స్టార్‌గా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన ఇటీవల 'రామ్ అసుర్' సినిమాలో శివన్నగా నటించారు. ప్రేక్షకుల విశేష ఆదరణతో ఈ సినిమా ఘన విజయం సాధించడంతోపాటు షానీ పోషించిన శివన్న పాత్రకు మంచి స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో షానీ తన ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ''రామ్ అసుర్' ఘన విజయం నా జీవితంలో కీలక మలుపు. ఈ సినిమా విజయోత్సవ సభలకు వెళ్తే, శివన్నా.... అంటూ ప్రేక్షకులు ఆప్యాయంగా పిలవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. శివన్న పాత్రతో మరింత గుర్తింపు లభించింది. జెడ్చర్లకు చెందిన నేను ఉస్మానియా యూనివర్శిటీ లో డిగ్రీ, నిజాం కాలేజ్‌లో పీజీని పూర్తి చేశా. నటనపై ఆసక్తితో ఉండేవాడిని. 2003లో ఓ రోజు 'సై' సినిమా కోసం దర్శక దిగ్గజం రాజమౌళిగారు నిర్వహించిన ఆడిషన్‌కి వెళాను. స్వతహాగా నేను స్టోర్స్మెన్ కావడంతో సెలెక్ట్ అయ్యాను. ఆ టైమ్‌లోనే నా లుక్ చాలా వెరైటీగా ఉందంటూ రాజమౌళిగారు భుజంతట్టి ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చాను. అంతేకాదు 'సై' సినిమా నా నటనా జీవితానికి మంచి మార్గం వేసింది. దీంతో ఇప్పటి వరకు 70కిపైగా సినిమాల్లో నటిస్తే, దాదాపు 30 సినిమాలు సూపర్‌హిట్ కావడం గర్వంగా ఉంది. 'ఘర్షణ', 'దేవదాస్', 'హ్యాపీ', 'రెడీ', 'ఒక్క మగాడు', 'శశిరేఖా పరిణయం' లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. 'అలా.. ఎలా..?' చిత్రంలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో కలిసి హీరోకి సమానమైన పాత్ర చేసి, ప్రేక్షకులను మెప్పించినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యా. అలాగే 'దేశంలో దొంగలు పడ్డారు' చిత్రంలోనూ హీరోగా నటించా. 'అలా.. ఎలా..', 'దేశంలో దొంగలు పడ్డారు', 'రాక్షసి' చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ బాధ్యతలు నిర్వహించాను. ఈ డిసెంబర్లో నెలలో నేను నటించిన 'కిన్నెరసాని', 'అమరన్', 'గ్రే', 'పంచతంత్రం' తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్‌లోనూ భిన్న పాత్రలతో, భిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి నటుడిగా మరింత గుర్తింపు పొందాలన్నది నా లక్ష్యం' అని అన్నారు.