Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రియా, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'గమనం'. ఈ సినిమాతో దర్శకురాలు సజనా రావు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం దర్శకురాలు సృజనా రావు మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు..
'ఈ సినిమా కథ సడెన్‌గా పుట్టిందేమీ కాదు. నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సంఘటనలన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో మూడు, నాలుగు కథలుంటాయని కాదు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే లైఫ్ సర్కిల్‌ను చూపించే ప్రయత్నం చేశాను. జీవిత ప్రయాణం గురించి చెప్పడమే గమనం. ఇందులోని ప్రతీ ఒక్క పాత్రకు ఓ జర్నీ ఉంటుంది. ఈ కథను ఓ డ్రాఫ్ట్‌లా రాసుకున్నప్పుడు నిర్మాత జ్ఞానశేఖర్ గారికి పంపాను. ఆయనకు బాగా నచ్చింది. ఇలాంటి సినిమానే తీయాలని అనుకుంటున్నానని అన్నారు. అయితే చిన్న సినిమాగానే తీయాలని అనుకున్నాం. కానీ పెద్ద సినిమాగా మారిపోయింది. మా చిత్రానికి డైరెక్టర్ క్రిష్ మంచి సహకారాన్ని అందించారు. శ్రియా సరన్, చారు హాసన్ వంటి సీనియర్ నటీనటులతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. వీళ్ళు తమ పాత్రలకు జీవం పోశారు. శ్రియా మాత్రం చాలా కొత్తగా కనిపిస్తారు. ప్రతీ ఒక్కరూ ఆమెతో ప్రేమలో పడిపోతారు. శివ కందుకూరి క్రికెటర్ అవ్వాలని అనుకునే అలీ అనే కుర్రాడి పాత్రలో కనిపిస్తారు. అతడిని ప్రేమించే అమ్మాయిగా ప్రియాంక జవాల్కర్ కనిపిస్తారు. నిత్యామీనన్‌కి ఈ కథ తెలుసు. ఓ క్యారెక్టర్ చేయాలని అడిగితే, వెంటనే ఓకే చెప్పారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇళయరాజా కావాలని అనడంతో నిర్మాతలు షాక్ అయ్యారు. ఒక్కసారి మీటింగ్ ఏర్పాటు చేయండని అడిగాను. ఓ దేవుడిని చూడబోతోన్నాననే ఫీలింగ్ వచ్చింది. ఇళయరాజాగారికి కథ చెబుతూ ఉన్నాను.. 'హే ఆపు..' అని, ఓ ఫోటో తీయండి.. మేం సినిమా చేయబోతోన్నామని ఆయన చెప్పడంతో నా ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. ఈ సినిమా ఆర్ఆర్ చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే జ్ఞానశేఖర్ గారు తీసిన కొన్ని షాట్స్ చూసి ఇళయరాజా గారు ఆశ్చర్యపోయారు. సాయిమాధవ్ గారు సినిమా ఒప్పుకుని చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇందులో కొన్ని డైలాగ్సే ఉంటాయి. తక్కువ మాటలే ఉన్నప్పుడు అవి ఎంతో ప్రాముఖ్యత ఉంటాయనేది నా అభిప్రాయం. దర్శకురాలిగా ఎన్నో డాక్యుమెంటరీలను తీశాను. నాకు జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం. నా జీవితంలో కలిసిన ప్రతీ ఒక్కరి నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాశా. పైగా నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. అవన్నీ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. నెక్ట్స్ సినిమా కోసం ఓ స్క్రిప్ట్ రెడీగా ఉంది' అని అన్నారు.