Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన విషయం తెలిసిందే. ఛైర్మన్‌గా డా||లయన్ ప్రతాని రామకష్ణగౌడ్, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మన్లుగా ఎ.గురురాజ్, నెహ్రు, సెక్రటరీగా జెవిఆర్. తెలంగాణ 'మా' ప్రెసిడెంట్‌గా రష్మి ఠాకూర్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రమేష్ నాయుడు తదితరులు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టిఎఫ్‌సిసి ఛైర్మన్‌తో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు విష్ణు చేతుల మీదుగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 'టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌గా నాలుగవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకష్ణగౌడ్కి, ఇతర కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది కళాకారులకు చేయూతనిస్తున్నారు. హెల్త్ కార్డులు, కరోనా సమయంలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. కళాకారులకు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం' అని తెలిపారు. 'సినిమా నటులలో ఆంధ్ర, తెలంగాణ అనే భేదం మాకు లేదు. మనమందరం తెలుగు వారం. అందరం కలసి తెలుగు సినిమా పరిశ్రమని అభివృద్ధి చేద్దాం' అని మంచు విష్ణు చెప్పారు.
టీఎఫ్‌సీసీ ప్రెసిడెంట్ ప్రతాని రామకష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'ఈ ఛాంబర్ కేవలం తెలంగాణ వారికే కాకుండా తెలుగు సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరికీ సంబంధించినది. ఏడుగురు సభ్యులతో ప్రారంభమైన ఈ అసోసియేషన్ ఇప్పుడు 10 వేల మంది సభ్యులతో ఉండటం చాలా సంతోషంగా ఉంది. సభ్యుల సంక్షేమం కోసం కావాల్సిన అన్నింటిని చేస్తున్నాం. దీనికి ప్రభుత్వం కూడా మంచి సహకారం అందిస్తోంది' అని తెలిపారు.