Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా 'ప్రాజెక్ట్ కె' (వర్కింగ్ టైటిల్). బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనె నటిస్తున్నారు. దీపికా నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది. వైజయంతి మూవీస్ పతాకంపై 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమా షూటింగ్ కోసం దీపికా పదుకొనె శనివారం హైదరాబాద్‌కి చేరుకోవడంతో, ఆమెని చూసేందుకు అభిమానులు భారీగా ఎయిర్‌పోర్ట్‌కి తరలి వచ్చారు.
నేటి (ఆదివారం) నుంచి చిత్రీకరణలో దీపికా పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, దక్షిణాది కూతురిగా, విశ్వవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నాయికగా, ఉత్తరాది రారాణిగా అలరిస్తున్న మా దీపికాకి సాదర ఆహ్వానం అంటూ సంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, చీరలు, గాజులతో ఉన్న ఓ ఫొటోని కూడా పోస్ట్ చేసింది.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తున్నారు. దీపికా ప్రస్తుతం ఈ సినిమాతోపాటు 'పఠాన్', 'సర్కస్' వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. అలాగే కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా రూపొందిన '83' చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.