Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రియా, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'గమనం'. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో సృజనారావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఆదివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం..
'నిర్మాత జ్ఞానశేఖర్ గారు ఈ సినిమా కోసం అడిగారు. ముస్లిం అమ్మాయి పాత్ర కావడంతో బుర్కా వేసి లుక్ టెస్ట్ చేశారు. బాగుండటంతో ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చా. అంతేకాదు ఈ కథ నచ్చడంతోపాటు ఈ సినిమాకి ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారని తెలిసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని మిస్ కాకూదని డిసైడ్ అయ్యాను. ఇందులో నా పాత్రకు ఎక్కువగా డైలాగ్స్ ఉండవు. కేవలం కళ్లతోనే నటించాల్సి ఉంటుంది. దీంతో కొంచెం కష్టంగా అనిపించినా, ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశా. నా పాత్ర పేరు ఝారా. నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించడం చాలా ఆనందంగా ఉంది' అని ప్రియాంక జవాల్కర్ చెప్పారు.
సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్ స్లో అవుతుందనే భయం ఉంది. అలాగని వచ్చిన సినిమాలన్నీ ఫటా ఫట్ చేస్తే, ఫ్లాపులొస్తే, పరిస్థితి ఏంటనే భయమూ ఉంది. అందుకే కథ నచ్చితేనే ఒప్పుకుంటున్నా. హీరోలందరితో పని చేయాలని ఉంది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేస్తా. బోల్డ్ క్యారెక్టర్ అయినా సరే. 'టాక్సీవాలా' సినిమా సక్సెస్‌ను సరిగా వాడుకోలేకపోయానని ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధిని మనం మార్చలేం. కొన్ని సినిమాలు మనకు వద్దనుకున్నా వస్తాయి. 'ఎస్ఆర్ కళ్యాణమండపం', 'తిమ్మరుసు' ఇంత హిట్ అవుతాయని నేను కూడా అనుకోలేదు. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.