Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ చంద్ర, అవికా గోర్, సాయి రోనక్, దేవి ప్రసాద్, ప్రమోదిని, శ్రీ లక్ష్మీ, శ్రీనివాస్ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'బ్రో'. జెజెఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తిక్ తుపురాని దర్శకత్వంలో రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో విశేష ప్రేక్షాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం కేక్ కట్ చేసి ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జేజేఆర్ రవిచంద్ మాట్లాడుతూ, 'అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక ఢిఫరెంట్ కథనాన్ని తీసుకుని దర్శకుడు చాలా చక్కగా ఈ సినిమాని తీశాడు. ఇందులో నవీన్‌కు చెల్లెలుగా నటించిన అవికా గోర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా అన్నయ్యే తనకి అన్ని అని బతికే చెల్లెలు పాత్రలో అందర్నీ అలరించింది. చెల్లెల్ని అమితంగా ప్రేమించే అన్న పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది' అని తెలిపారు. 'మరాఠీలో వచ్చిన 'హ్యాపీ బ్రదర్' సినిమాకు సచిన్ కుందాల్కర్ అందించిన కథ చాలా కొత్తగా, ఎమోషనల్‌గా ఉంది. మన నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు మా నిర్మాత రవిచంద్కి నచ్చటంతో ఈ సినిమా ట్రాక్ ఎక్కింది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది' అని దర్శకుడు కార్తిక్ తుపురాని అన్నారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, 'మంచి సినిమా చేశాం. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అందరికీ గుర్తుండి పోతాయి' అని చెప్పారు. 'ఇందులోని చెల్లెలి క్యారెక్టర్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలలో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమా చూసిన వారందరికీ ఇందులో ఉన్న ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి' అని అవికాగోర్ అన్నారు.