Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వినూత్న కాన్సెప్ట్‌తో మొబైల్ ఫోన్ (ఒన్‌ప్లస్ 6)తో తెరకెక్కించిన 'ది రాంగ్ స్వైప్' చిత్రానికి మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. సరికొత్త సాంకేతిక ప్రయోగాలతోపాటు మంచి కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు తీస్తే కచ్చితంగా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోమారు నిరూపించారు' అని దర్శకుడు రవికిరణ్ గాడాల అన్నారు.
డాక్టర్‌గా సేవలు అందిస్తూనే సినిమాపై ఉన్న ప్యాషన్‌తో 'ది రాంగ్ స్వైప్' చిత్రంతో దర్శకుడిగా రవికిరణ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.
'అమ్మానాన్నలిద్దరూ పేరొందిన డాక్టర్లు. నేను కూడా చిన్న వయసులోనే డాక్టర్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాను. అయితే చిన్నప్పట్నుంచి సినిమా మీద మంచి ఆసక్తి ఉండేది. వేలాది మంది కాదు, కొట్లాదిమందిలో ఏ ఒక్కరిలోనైనా కొంతయినా మార్పు తీసుకురావాలనే తపనతో సినీ రంగ ప్రవేశం చేసి, తొలి చిత్రంగా 'ది రాంగ్ స్వైప్'ని తీశా. నాతోటి డాక్టర్ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో మొబైల్ ఫోన్ (ఒన్ ప్లస్ 6టి)ను కెమెరాగా చేసుకుని, చాలా పరిమిత బడ్జెట్‌తో, వీకెండ్స్‌లో మాత్రమే షూట్ చేశాను. ఈ చిత్రం ద్వారా ముగ్గురు డాక్టర్లు ఇండిస్టీకి పరిచయం అయ్యారు. ఈ చిత్ర నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి, హీరో డాక్టర్ ఉదరు రెడ్డి, డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి.... ముగ్గురూ ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో మరిన్ని సినిమాలను నిర్మించాలనే ఉత్సాహంతో ఉన్నారు. అలాగే అగ్ర దర్శకులు కోదండరామిరెడ్డి, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సోనీ లివ్ హెడ్ మధుర శ్రీధర్ రెడ్డి, ఊర్వశి సారథులు రవి కనగాల, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ సినిమా ఎంతో బాగుందని కితాబివ్వడం మా అందరికీ సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకపోవడం ఈ సినిమా ప్రత్యేకత అని వారు ప్రశంసించడం ఆనందంగా ఉంది. '6 ఎమ్.పి' పేరుతో మరో సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాను' అని రవికిరణ్ అన్నారు.