Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నెల రాజుని.. ఇల రాణిని.. కలిపింది కదా సిరివెన్నెల..' అంటూ సినీ గేయ దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట అందర్నీ భావోద్వేగ భరితుల్ని చేస్తోంది. 'శ్యామ్ సింగ్ రారు' చిత్రం కోసం ఆయన రాసిన రెండు పాటల్లో ఇదొకటి. ఈ పాటను చిత్ర బృందం మంగళవారం రిలీజ్ చేసింది. నాయకానాయికలు నాని, సాయిపల్లవి మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమని తెలిపే నేపథ్యంలో వచ్చే ఈ పాటను సిరివెన్నెల తనదైన శైలిలో రాశారు. ఈ పాటని వింటున్న సేపూ ఆయన మన మధ్య సజీవంగానే ఉన్నారు కదా అనే భావన కలిగిందని సోషల్ మీడియా వేదికగా వేలాది మంది నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు పెట్టారు. సిరివెన్నెలగారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున ఈ పాటను రికార్డ్ చేశారని తెలిసి మరింత భావోద్వేగానికి లోనవుతూ ఆయనకి నివాళి అర్పించారు. 'సిరివెన్నెల'పై ఉన్న మమకారంతో ఈ చిత్రాన్ని సగౌరవంగా ఆయనకు అంకితమిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
'నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగ రారు'. ఈ చిత్రానికి రాహుల్ సంకత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని, సాయి పల్లవిల మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమ కథను చిత్రీకరించే ఈ మనోహరమైన పాటకు మిక్కీ జె మేయర్ అదే స్థాయిలో అద్భుతమైన సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి కూడా అదే స్థాయిలో మనోహరంగా పాడారు.నాని, సాయి పల్లవి కేవలం రాత్రులు మాత్రమే కలుస్తారు. వారు కలిసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది సాయి పల్లవి. వారిద్దరి మధ్య క్లాసిక్ కెమిస్ట్రీ ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. నాని కథానాయకుడిగా, సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో ఈనెల 24న విడుదల కానుంది' అని చిత్ర బృందం తెలిపింది.
రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : సాను జాన్ వర్గీస్, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల, ఎడిటర్ : నవీన్ నూలి, ఫైట్స్ : రవి వర్మ, కొరియోగ్రఫీ : కతి మహేష్, యశ్ మాస్టర్.