Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చరిత్ర కాదు.. కేవలం కల్పిత కథ మాత్రమే అని దర్శకుడు రాజమౌళి మరోమారు క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్ర ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష ఆదరణకు కతజ్ఞతలు చెప్పడం కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ శనివారం మీడియాతో సమావేశమైంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఆలియాభట్, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
స్నేహం మీద తీసిన సినిమా
- దర్శకుడు రాజమౌళి
ఈ సినిమా మొత్తం కల్పితమే. చరిత్రకు సంబంధించిన సంఘటనలు, విషయాలు ఇందులో లేవు. ఇది ఎవరి బయోపిక్ కాదు. ఇందులో 95 శాతం సినిమా ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. అప్పట్లో గోండు సామ్రాజ్యం ఉండేది. నిజాం పరిపాలన వల్ల వాళ్ల వర్గం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి వర్గానికి చెందిన ఓ వ్యక్తి నగరానికి వస్తే.. అనే ఆలోచన ఈ సినిమాలో చూపించాను. అదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు జన ప్రపంచంలోకి వస్తే, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు?, వ్యక్తిత్వాల మీద, పాత్రలు మీద మాత్రమే ఇందులో చూపించాను. అలాగని ఇది దేశభక్తి సినిమా కాదు. ఇదొక ఫ్రెండ్షిప్ మీద తీసిన సినిమా. అయితే అంతర్లీనంగా దేశభక్తి కూడా ఉంటుంది.
తారక్-చరణ్‌లిద్దరూ ఒకే బైక్‌పై వస్తున్న షాట్‌ని మొదట షూట్ చేశాను. వాళ్ల మాటలు, ప్రవర్తన చూసి రెండు ఆటంబాంబులు దొరికినట్లు ఫీల్ అయ్యా. ఈ పెయిర్ ఆన్‌స్క్రీన్‌లో బాగా వర్కౌట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను.
కథకు తగ్గట్టు మంచి నటీనటులు దొరకడం నా అదష్టం. ఈ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. మరికొన్ని భాషల్లో డబ్ చేస్తున్నాం. కరోనాతో జరిగిన ప్రాణనష్టం వల్ల బాధపడ్డా. కానీ ఆ సమయాన్ని ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేశా. కరోనా వల్ల మన ఒక్క సినిమానే ఆగిపోలేదు. అన్ని సినిమాలు ఆగిపోయాయి. మొత్తంగా ప్రపంచమే ఆగిపోయింది. ఇది ఒక పాజ్ మాత్రమే.. స్టాప్ కాదు.
'ఆర్ఆర్ఆర్' ఒక కమిట్మెంట్
- ఎన్టీఆర్
ప్రతి జీవికి ఓ ఆశ ఉంటుంది. అదే ముందుకి నడిపిస్తుంది. అలాగే రాజమౌళి కన్న కలని సాకారం చేయడంలో మేం భాగం కావాలనే జోష్‌తో వర్క్ చేశాం. 'ఆర్ఆర్ఆర్' అనేది ఒక కమిట్మెంట్. నటులుగా మేం ఆయనకు ఇచ్చిన కమిట్మెంట్. నిజం చెప్పాలంటే.. కరోనాలోనూ మాకు 'ఆర్ఆర్ఆర్' గురించే ఆలోచన. మలయాళం తప్ప తెలుగు, కన్నడ, హిందీ, తమిళంలో డబ్బింగ్ చెప్పాను.
మూడు భిన్న షేడ్స్‌లో కనిపిస్తా
- రామ్‌చరణ్
రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఆయన చెప్పినదాన్ని మేం చేస్తే చాలు.. మేం పాసై పోయినట్టే. ఇందులో నేను మొత్తం మూడు షేడ్స్‌లో కనిపిస్తాను. మూడూ విభిన్నంగానే ఉంటాయి.
రాజమౌళితో మరో సినిమా చేస్తా
- అలియాభట్
రాజమౌళి సర్ సినిమాలో నటించడం నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కల నెరవేరింది. ఛాన్స్ వస్తే మరోసారి ఆయనతో వర్క్ చేయాలని ఉంది. చరణ్-తారక్ మంచి నటులు. వాళ్లతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది.
ఎపీలో తగ్గించిన టికెట్ ధరలు కచ్చితంగా మా సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఎపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. పాజిటివ్ స్పందన వస్తుందని ఆశిస్తున్నాం.
- నిర్మాత డి.వి.వి.దానయ్య