Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లుఅర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప : దిరైజ్'. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా మంగళవారం చిత్ర కళాదర్శకులు రామకృష్ణ, మోనిక నిగ్గోత్రే మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు సుకుమార్ సినిమాలకు పని చేస్తే కళా దర్శకుల నైపుణ్యం ఏంటో కూడా ప్రపంచానికి తెలుస్తుంది. అంతేకాదు ఆయన సినిమాల్లోని సన్నివేశాలను సెట్లో చిత్రీకరించారా లేక రియల్ లొకేషన్లలో చిత్రీకరించారా అనే విషయంలో ప్రేక్షకులు కూడా సందిగ్ధంలో పడతారు. ఇక లేటెస్ట్గా విడుదలవ్వబోతున్న 'పుష్ప' విషయంలోనూ ప్రేక్షకులు కచ్చితంగా మీమాంసలో పడతారు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు హీరో అల్లు అర్జున్‌గారు సైతం చాలా సార్లు రియల్ లొకేషన్లలో చేస్తున్నాం కదా అని అడిగారంటే, సెట్లు ఎంత నేచురల్‌గా ఉన్నాయో వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతోంది. కరోనాతోపాటు అడవుల్లో చిత్రీకరణపై ఉన్న నిబంధనల కారణంగా చాలా వరకు అడవి సెట్ వేశాం. సహజ సిద్ధమైన అడవిని అదే స్థాయిలో సృష్టించడం చాలా చాలా కష్టం. అయినప్పటికీ సినిమా చూస్తున్న ప్రేక్షకులు రియల్ ఫారెస్ట్‌లోనే చిత్రీకరణ చేశారని ఫీలయ్యేలా సెట్లు వేశాం. ఇలాంటి సినిమాలను ఏ నిర్మాత కూడా చేసేందుకు సాహసం చేయరు. కానీ మైత్రి మూవీస్ నిర్మాతలు దీన్నొక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. విజువల్ ఫీస్ట్‌గా ఉండే ఈ సినిమా గురించి కచ్చితంగా జాతీయస్థాయిలో మాట్లాడుకుంటారు. సుకుమార్, అల్లుఅర్జున్, నిర్మాత డెడికేషన్ ఫలితమే ఈ సినిమా బాగా రావడానికి కారణం. 'రంగస్థలం'లా మాకు మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది' అని అన్నారు.