Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, రణ్‌బీర్ కపూర్, కరణ్ జోహార్, అలియా భట్, అయాన్ ముఖర్జీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని తొలి భాగాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమౌళి, నాగార్జునతోపాటు 'బ్రహ్మాస్త్ర' చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ, 'ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'బ్రహ్మాస్త్ర' విజన్ చాలా ప్రత్యేకమైనది. ఇది దాని కథ, కథనంలో ప్రతిబింబిస్తుంది. అనేక విధాలుగా ఇది నాకు 'బాహుబలి'ని గుర్తు చేస్తుంది. సినిమాపై ప్రేమ, ప్యాషన్ ఉన్న వాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి. 'బాహుబలి'కి నేను చేసినట్లే అయాన్ ముఖర్జీ కూడా ఈ సినిమాని రూపొందించడంలో సమయాన్ని వెచ్చించడం, దాన్ని సరిచేయడానికి ఓపికగా ఉండటం నేను చూశాను. ఈ చిత్రం ఆధునిక సాంకేతికతతో పురాతన భారతీయ సంస్కతికి చెందిన ఇతివత్తాలను చూపించడంతో పాటు అత్యద్భుతమైన విఎఫ్ఎక్స్తో మిమ్మల్ని కట్టి పడేస్తుంది. 'బాహుబలి' తర్వాత మరోసారి ధర్మ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాను' అని తెలిపారు.
'అయాన్‌తో పాటు 'బ్రహ్మాస్త్ర' చిత్ర బందంతో కలిసి పనిచేయడం నాకు అద్భుతమైన అనుభవం. ఈ ప్రాజెక్టులోకి రాజమౌళిని తీసుకురావడం గర్వకారణం. 2022లో ఈ చిత్రాన్ని నా అభిమానులకు అందించడానికి నేను ఎదురుచూస్తున్నాను. తెలుగులో దీనికి 'బ్రహ్మాస్త్రం' అని టైటిల్ ఖాయం చేశారు' అని నాగార్జున చెప్పారు.
నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ, 'నేను భాగమైన అత్యంత ప్రతిష్టాత్మకమైన, లాంగ్ విజన్ ఉన్న ప్రాజెక్ట్. అయాన్ ప్యాషన్, కష్టానికి ప్రతిబింబమీ చిత్రం. తను తీసిన విధానం అత్యద్భుతంగా ఉంది.. అలాగే ఫలితం కూడా అసాధారణంగా ఉంటుందని ఆశిస్తున్నాం. పాన్ ఇండియన్ వైడ్‌గా ఇది కచ్చితంగా రావాల్సిన సినిమా' అని అన్నారు.
''బ్రహ్మాస్త్ర' అనేది నేను చాలా సంవత్సరాలుగా పెంచుకుంటున్న కల. ఇది ప్రతిష్టాత్మకమైన మూడు భాగాలుగా చేస్తున్న సినిమా. ఇప్పటి వరకు చేసిన ప్రయాణం ఎంతో అద్భుతం. ఈ సినిమా కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రాజమౌళి గారు ఈ సినిమాలో భాగం అవ్వడం ధైర్యాన్నిచ్చింది. ఆయన చేసిన 'బాహుబలి' సినిమా నా కలను ధైర్యంగా కొనసాగించగలననే నమ్మకాన్ని ఇచ్చింది' అని దర్శకుడు అయన్ ముఖర్జీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ పాల్గొని చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను షేర్ చేసుకున్నారు.