Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల తర్వాత ఎన్నో భారీ అంచనాల నేపథ్యంలో అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన చిత్రం 'పుష్ప : ది రైజ్'. అందరి అంచనాలకు దీటుగా ఉన్న ఈ చిత్రానికి సర్వత్రా మంచి టాక్ వచ్చింది. తొలి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ, 'పుష్ప'కు వస్తున్న ఆదరణ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు. అన్ని చోట్లా టెర్రిఫిక్‌గా కలెక్షన్లు వస్తున్నాయి. ఒక్క నైైజాంలోనే తొలిరోజు రూ.10కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేయటం చాలా సంతోషంగా అనిపించింది. విడుదలకు ముందు కొన్ని చోట్ల సరైన ప్రమోషన్ చేయలేక పోయాం. అయినప్పటికీ హిందీలో తొలిరోజు రూ.4కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్లో అల్లు అర్జున్‌కు ఉన్న మంచి క్రేజ్ వల్లే ఇది సాధ్యమైందని భావిస్తున్నా. పుష్పరాజ్ లాంటి శక్తిమంతమైన పాత్రలో అల్లు అర్జున్‌ని చూపించాలన్న కోరిక ఇప్పటిది కాదు. ఈ విషయాన్ని 'ఆర్య' సినిమా చేస్తున్నప్పుడే బన్నీకి చెప్పా. పుష్పరాజ్ పాత్రలో ఆయనెంతో చక్కగా ఒదిగిపోయారు. ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా మొత్తాన్ని ఆయనే నడిపించాడు. కమర్షియల్ ఫార్మాట్లో నేచురల్‌గా తీసిన సినిమా ఇది. 'పుష్ప' సినిమాని అడవుల్లోనే చిత్రీకరించాం. అక్కడ సరైన వసతులుండవు. ప్రతిరోజు రెండున్నర గంటలకు పైగా అడవిలో జర్నీ చేయాల్సి వచ్చేది. అక్కడికి వెళ్లాక అన్నీ సెట్ చేసుకోవాలి. పైగా ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. దీంతో ఈ సినిమా నాకు చాలా సవాల్‌గా అనిపించింది. అంతేకాదు ఇక మనకి సినిమాలు వద్దురా బాబు అనే వైరాగ్యమూ కలిగింది (నవ్వుతూ).
నాపై నమ్మకంతో ఐటమ్ సాంగ్ చేసింది
సమంతని ఇప్పటి వరకు ఎవరూ స్పెషల్ సాంగ్‌లో చూపించలేదు. ఈ పాట గురించి ఆమెకు చెప్పగానే ఇప్పుడు.. అవసరమా? అని అంది. నటిగా మీకూ కొత్తగా ఉంటుందని చెప్పి, కన్వీన్స్ చేసినా, తను వద్దనే చెప్పింది. కేవలం నా మాటపై నమ్మకంతో ఓకే చెప్పింది. ఇప్పుడు ఈ పాట ఎంత ట్రెండింగ్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో 'పుష్ప' ప్రపంచాన్ని పరిచయం చేశాం. పుష్పరాజ్ బాల్యం, తండ్రితో అనుబంధం, తన బ్రదర్స్‌కి ఎలా దగ్గరయ్యాడు?, విలన్లను ఎలా ఎదుర్కొంటాడు? అనే విషయాలను రెండో పార్ట్ 'పుష్ప : ది రూల్'లో చూపించనున్నాం. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. అదేంటన్నది తెరపైనే చూడాలి. ఫిబ్రవరి నుంచి షూటింగ్ చేస్తాం. దసరా లేదా డిసెంబర్ 17న విడుదల చేస్తాం. 'ఆర్య 3' తీస్తే, దానికి 'ఆర్య 3' అనే పేరైతే పెట్టను. 'ఆర్య 2' టైటిల్ పెట్టడం వల్ల చాలా మైనస్ అయింది. 'పుష్ప 2' తర్వాత విజరు దేవరకొండతో సినిమా చేయబోతున్నాను. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉంటుంది' అని చెప్పారు.