Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇప్పుడు యావత్ ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇలాంటి తరుణంలో మన పాన్ ఇండియా సినిమాల విడుదలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. అందుకే సంక్రాంతికి విడుదల కాబోతున్న 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' చిత్రాల విడుదలకు మార్గం సుగమనం చేశాం' అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. సినీ పరిశ్రమలో సంక్రాంతి అంటే సినిమా పండగ. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఈ ఫెస్టివల్ సీజన్లోనే బరిలోకి దిగుతాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా చిత్రాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్'తోపాటు పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రాలు విడుదల కాబోతుండటంతో థియేటర్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర నిర్మాతల గిల్డ్ సమావేశమై ఈ సినిమాల రిలీజ్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ,'జనవరి 12న విడుదల కావాల్సిన 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్రవరి 25కి, ఆ రోజు విడుదల కావాల్సిన మా 'ఎఫ్3' చిత్రాన్ని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నాం. జనవరి 7న 'ఆర్ఆర్ఆర్', జనవరి 14న 'రాధేశ్యామ్' చిత్రాలు విడుదల వుతాయి. పాన్ ఇండియా చిత్రాలకు ఇబ్బంది కలగకుండా సమస్యలను అర్థం చేసుకుని, విడుదల తేదీని వాయిదా వేసేందుకు అంగీకరించిన 'భీమ్లా నాయక్' నిర్మాతలకు, హీరో పవనకళ్యాణ్కు గిల్డ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరోనా భయాల నేపథ్యంలో సినిమాల విడుదల విషయంపై నిర్మాతలందరితో కూడా మాట్లాడుతున్నాం. అయితే హీరోల అభిమానులూ ఆందోళన చెందకుండా, అర్థం చేసుకోవాలి. అప్పుడే పరిశ్రమలో మరింత ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది' అని చెప్పారు.