Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శక్తివంతమైన పాత్రలైతేనే సాయిపల్లవి అంగీకరిస్తుందా.. అంటే అలా ఏం లేదు. నేను నమ్మి చేసినవి, ప్రేక్షకులకు కూడా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది' అని కథానాయిక సాయిపల్లవి చెప్పారు.
నాని హీరోగా సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాహుల్ సంకత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా స్క్రిప్ట్ చదివేటప్పుడు దేవదాసి క్యారెక్టర్ ఎలా చేయాలి అనేదాని కంటే, వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుందని చెప్పడం నచ్చింది. వేరే సినిమాలతో పోలిస్తే ఈ పాత్రను సైకాలజీ పరంగా చేశా. ఈ పాత్రలో సాయి పల్లవి కనిపించదు..దేవదాసి పాత్రే కనపడుతుంది. నేను డాన్స్ ఎక్కువ చేసింది 'లవ్ స్టోరీ'లోనే అనుకుంటా. ఈ సినిమాలో డాన్స్ ఎంత కావాలో, అంతే పెట్టారు. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. నేను చేయగలుగుతానని రాహుల్ నమ్మి, నాతో క్లాసికల్ డాన్స్ చేయించారు. ఈ పాటలో నాతో చేసిన వారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు. పాట చిత్రీకరణ పూర్తయ్యాక వాళ్లలా నేను కూడా చేశానని అభినందిస్తే, అదే పెద్ద సక్సెస్ అనుకున్నా. 'ఎంసీఏ' సినిమాతో పోలీస్తే నేను, నానిగారు నటించిన సన్నివేశాలు కొంచెం డీప్‌గా ఉంటాయి. అయితే అప్పుడూ, ఇప్పుడూ నానితో సేమ్ కంఫర్ట్. రాహుల్ చాలా క్లారిటీతో సినిమా తీశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో కతజ్ఞతతో కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే నా బ్రెయిన్లో నేను మామూలు సాయిపల్లవినే. అయితే, నేను చేసే సినిమాలు చాలామందికి సంతోషం కలిగిస్తోందని ఎమోషనల్ అయ్యాను. నేను అందరికీ రుణపడ్డాను. అందుకే నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు... ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నా. అయితే మాటలతో కాకుండా కన్నీళ్ళతో చెప్పా (నవ్వుతూ). 'విరాట పర్వం' పూర్తయ్యింది. తమిళంలో ఓ సినిమా చేశా. నచ్చితే వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తా' అని చెప్పారు.