Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్బస్టర్ల తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో 30వ సినిమా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
ముహూర్తపు షాట్‌కు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, టీజీ వెంకటేష్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా డైౖరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ, ''లక్ష్యం', 'లౌక్యం' తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం గోపీచంద్‌గారితో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకి కూడా మంచి కథ కుదిరింది. గోపీచంద్ గారి కెరీర్లో 30వ సినిమా కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. భూపతి రాజా అందించిన కథ మీద చాలా వర్క్ చేశాం. అందరూ హ్యాట్రిక్ హిట్ అనేవారు. అది ఇప్పుడు బాధ్యతలా మారింది. ఆ రెండు సినిమాలను మించేలా ఇది ఉండబోతోంది. కెమెరామెన్ వెట్రితో 'లౌక్యం' సినిమా చేశాను. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. సంక్రాంతి పండుగ తర్వాత చిత్రీకరణ ఆరంభిస్తాం' అని తెలిపారు.
'గోపీచంద్, శ్రీవాస్ హ్యాట్రిక్ మూవీని మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం' అని నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ. '2007లో 'లక్ష్యం', ఆ తరువాత ఏడేళ్లకు 'లౌక్యం'. మళ్లీ ఏడేళ్లకు ఈ సినిమా చేస్తున్నాం. భూపతి రాజా మంచి కథ రాశారు. వెట్రి గారితో దాదాపు ఐదు చిత్రాలు చేశాను. ఆయనతో చేసినప్పుడు పాజిటివ్ వైబ్ ఉంటుంది. మంచి కథకు మంచి ఆర్టిస్ట్‌లు దొరికారు. మంచి టీంతో ముందుకు వెళ్తే ఫలితం కూడా అంతే బాగా వస్తుందని నమ్ముతున్నాను' అని చెప్పారు. ఈ చిత్రానికి డైలాగ్స్ : వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ కుమార్ మన్నె, దర్శకత్వం : శ్రీవాస్.