Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందరూ సంయమనంతో ఉండండి. తెలంగాణాలో మాదిరిగానే ఆంధ్రాలోనూ పరిస్థితులు ఏర్పడతాయి' అని నిర్మాత దిల్రాజు అన్నారు.
థియేటర్ల టికెట్ రేట్లను భారీగా తగ్గించడంతో ఆంధ్రప్రదేశ్లో థియే టర్లు మూతపడుతున్నాయి. దీంతో సినీ పరిశ్రమ తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటోంది. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఆ స్పందనల వల్ల ప్రభుత్వంతో మరింత గ్యాప్ పెరుగుతుండటంతో సోమవారం నిర్మాత దిల్రాజు దీని గురించి మాట్లాడుతూ,'తెలంగాణలో వచ్చినట్టే ఏపీలోనూ ఓ జీవో వస్తుందని ఆశిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సినీ పెద్దలు సభ్యులుగా ఉన్నారు. సినిమావాళ్లెవరూ ఈ అంశాలపై మాట్లాడొద్దు. అలాగే నిర్మాతలుగా మాకూ కొన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చినట్టే ఐదో ఆటకు ఏపీ ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. ఎగ్జిబిటర్లకు కొన్ని సమస్యలున్నాయి. నిర్మాతల సమస్యలు వేరు, వారి సమస్యలు వేరు. కమిటీలో వీళ్లూ ఉంటారు. ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి సమస్యలు తెలుస్తాయని భావిస్తున్నాం. జరిగిన దాని గురించి కాకుండా తెలుగు సినిమా మరింత ఉన్నత స్థాయికి ఎదిగేలా ఏం చేయాలో మాట్లాడతాం. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉంది. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి' అని చెప్పారు.