Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనీ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'డిటెక్టివ్ సత్యభామ'. సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన వేడుకలో ట్రైలర్ను నిర్మాత పోలెమోని శ్రీశైలం, మొదటి పాటను రాజ పోలెమోని, నటి సునీత పాండే రెండవ పాటను, పి.ఆర్.ఓ ఆర్.కె. చౌదరి మూడవ పాటను, నటి శివ జ్యోతి నాలుగవ పాటను, నటుడు మురళి ఐదవ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ, 'సోనీ అగర్వాల్ ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా, అన్ని అంగులతో తీర్చి దిద్దాం. స్క్రీన్ మాక్స్ ప్రసాద్ గారు మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 31న సుమారు 500 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.
'సంగీత దర్శకుడుగా వర్క్ చేసినప్పటికీ, నేను చెప్పిన కథను నమ్మి నిర్మాత ఈ చిత్రాన్ని నా దర్శకత్వంలో నిర్మించారు. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్స్,టర్న్స్ ఇందులో ఉంటాయి. పాటలు చాలా బాగుంటాయి. సోనీ అగర్వాల్ యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటాయి' అని దర్శకుడు నవనీత్ చారి అన్నారు. డి.ఓ.పి లక్కీ, నటి శివజ్యోతి, సునీత పాండే, మాటల రచయిత సంతోష్ ఇంగాని, నటుడు మురళి తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.