Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ విష్ణు, అమతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం 'అర్జున ఫల్గుణ'. తేజ మార్ని దర్శకుడు. ఈనెల 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు బుధవారం మీడియాతో ముచ్చటించారు.
'ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. రైటింగ్ స్కిల్స్, రైటర్స్‌ని నేను ఎక్కువగా ఎంచుకున్నాను. కొత్త దర్శకులనే ఎంచుకుంటూ వచ్చాను. దర్శకుడు తేజ కలిసినప్పుడు, తను చేసిన 'జోహార్' సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఇందులో ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే ఈ సినిమాని ఓకే చేశాను. అలాగే చాలా తక్కువ సమయంలో షూటింగ్‌ని పూర్తి చేసి షాక్ ఇచ్చాడు. నిర్మాతలు నన్ను, ఈ కథని బాగా నమ్మారు. గోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్లో చేయలేదు. నర్సీపట్నంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇందులో మేం ఐదుగురం ఫ్రెండ్స్. ఆ పేర్లలో ఫస్ట్ లెటర్స్‌తో 'ఆర్టాస్' అని వస్తుంది. 'ఆర్టాస్' అనే కూల్‌డ్రింక్ అనే పాయింట్ ఈస్ట్, వెస్ట్ వాళ్లకు మాత్రమే తెలుసు. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించే కంటే, ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని, తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు. ఈ సినిమా కోసం పూర్తిగా గోదావరి యాసలోనే మాట్లాడా. కొంచెం ఎటకారంగా కూడా ఉంటుంది (నవ్వుతూ). నా ప్రతీ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే, నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. రియలిస్టిక్ కథలే నా బలం. ప్రస్తుతం 'భళా తందనాన' సినిమా చేస్తున్నాను. అలాగే లక్కీ మీడియాలో ఓ పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ చేస్తున్నా' అని శ్రీవిష్ణు అన్నారు.