Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సినిమా ఇండిస్టీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్టిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు' అని హీరో, నిర్మాత మోహన్‌బాబు అన్నారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖ రాశారు. 'మౌనంగా ఉంటే చేతకాని తనం అనుకుంటున్నారు. అది తప్పు. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండిస్టీ గురించి, మనకి ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి, ఒకచోట సమావేశమవ్వాలి. సమస్యలు ఏంటి?, పరిష్కారాలు ఏంటి?, ఏది చేస్తే పరిశ్రమకి మనుగడ ఉంటుందనేది చర్చించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది? మళ్లీమళ్లీ చెబుతున్నా, సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్ళి, సమస్యల్ని వివరిస్తే మనకీ రోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు' అని లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు.
చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి మనకి న్యాయం చేయమని అడుగుదాం. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు. కానీ, ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు?
అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదు. ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం.