Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగు సినీ ఇండిస్టీ పెద్దగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ పెద్దరికం నాకొద్దు' అని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు.
ఆదివారం ఉదయం సినీ కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, 'గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందు కంటే మాకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మీరు ఉన్నారని మాకు ఓ ధైర్యం ఉంటుంది' అని చిరంజీవిని సినీ కార్మికులు కోరారు.
దీనికి స్పందించిన చిరంజీవి మాట్లాడుతూ, 'పెద్దరికం హౌదా నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకస్సలు వద్దు. కానీ, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అందరి బాధ్యతా తీసుకుంటా. అందుబాటులో ఉంటా. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తా. అనవసరమైన వాటికి మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగి, ఆ తగువులు తీర్చాలని నా దగ్గరకి వస్తే, నేను ఆ పంచాయితీ చేయను. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా సమగ్ర విశ్లేషణ చేసి, వారి కోసం నిలబడతా. సినీ కార్మికులు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. అన్ని సమస్యలు తీరి పరిశ్రమ మళ్ళీ కళకళలాడాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు.