Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అతిథిని చూస్తే దేవుడులా భావించే యువకుడి కథతో 'అతిధి దేవో భవ' సినిమా రూపొందిందని దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ అన్నారు. ఆది సాయి కుమార్, నువేక్ష జంటగా నటించిన చిత్రం 'అతిథి దేవోభవ'. రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 7న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ మాట్లాడుతూ, 'మాది చోడవరం దగ్గర బోగాపురం అనే మారుమూల గ్రామం. కాలేజీ రోజుల్లోనే సినిమాలు, నాటకాలపై ఆసక్తి ఎక్కువ. బిటెక్‌లో చేరినా సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గలేదు. మొదట్లో వినాయక్, కె.విశ్వనాథ్, రాజమౌళి వంటివారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం కలిగింది. దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో రాజాబాబు మిర్యాల పరిచయం అయ్యారు. ఆయన ఇచ్చిన అవకాశంతో మంచి టీమ్‌తో ఈ సినిమా చేశాను. తొలి సినిమానే సంక్రాంతికి విడుదల కావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ కథ నిర్మాతదే అయినా ఎవరి పని వారు చేయగలిగాం. టైటిల్ పరంగా ఇది క్లాస్ టైటిలే అయినప్పటికీ అందరికీ రీచ్ అవుతుంది. కథలో హీరోకి అందరూ అతిథులే. అలా హీరో ఎందుకు అనుకుంటాడనేది సినిమాలోనే చూడాల్సిందే. లవ్, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్లో భయం మీద డైలాగ్ ఉంది. అది ఏంటనేది సస్పెన్స్. హీరో ఎందుకు భయపడున్నాడనేది సినిమాకి హైలెట్ పాయింట్. సప్తగిరి పాత్ర కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సంగీతపరంగా శేఖర్ చంద్ర బాణీలు మంచి ఆదరణ పొందాయి. 'బాగుంటుంది నవ్వితే..' పాటను కాలర్ ట్యూన్‌గా యూత్ పెట్టుకున్నారు' అని చెప్పారు.