Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విమల్ కష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'డిజె టిల్లు'.
ఈ చిత్రంలోని 'లాలాగూడా అంబర్ పేట.. మల్లేపల్లి మలక్ పేట..టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల..' పాట గురువారం విడుదలైంది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ పాట విడుదలైన క్షణం నుంచే చార్ట్‌బస్టర్‌లో దూసుకు వెళ్తోంది. సామాజిక మాధ్యమాలలో సైతం డీజే స్థాయిలో స్పందన హౌరెత్తుతోంది.
ఈ సందర్భంగా గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, 'హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే ఒక పాట రాయాలని డైరెక్టర్ గారు చెప్పి, రామ్ మిరియాల ఇచ్చిన మంచి బీట్ ఉన్న ట్యూన్ పంపించారు. పక్కా హైదరాబాదీ రిథంతో ఉన్న ట్యూన్ వినగానే బాగా నచ్చింది. హైదరాబాద్ గల్లీల్లో ఒక రకమైన యాటిట్యూడ్‌తో ఉండే కుర్రాళ్ళు గుర్తొచ్చారు. ఏరియాల పేర్లతో పల్లవి ప్రారంభించి, హీరోపై మిగతా మిత్రులు, ఫ్యాన్స్ కోణంలో హుక్ లైన్ రాశా. తర్వాత టీజర్లో హీరో నటన, స్వాగ్ చూశాక చరణం అప్రయత్నంగా పలికింది. పాట ప్రోమోనే అద్భుతమైన వ్యూస్ రాబట్టుకుంది. మంచి డాన్సింగ్ నంబర్ని నేను రాయటం, అందరి సెలెబ్రేషన్స్‌లో నేనూ ఒక భాగమవ్వడం సంతోషంగా ఉంది' అని చెప్పారు. ఈ పాటకు భాను నత్యరీతులు సమకూర్చారు.
'ఇదొక కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రం. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, ఇటీవల రిలీజైన 'డిజె టిల్లు' టీజర్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 14 న విడుదల అవుతున్న మా చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు' అని దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: విమల్ కష్ణ.