Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మాఫియా ఇజం నడుస్తోంది. ఇది పరిశ్రమకు మంచి కాదు' అని టిఎఫ్‌సీసీ చైర్మన్ డా.లయన్ ప్రతాని రామకష్ణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,'గ్రామ పంచాయితీకి ఒక రేటు, మున్సిపాలిటీకి ఒక రేటు, జిల్లా స్థాయిలో ఒకరేటు అనే సిస్టమ్ ఉంటే తప్ప చిన్న చిత్రాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి. అయితే ఈ పద్ధతిలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేటుని కేటాయించడం హర్షించదగింది. ఆ విధానం తెలంగాణలో కూడా వస్తే బాగుంటుంది. కచ్చితంగా జీవో 21ని సవరించాలి. అలాగే లీజు విధానాన్ని కూడా రద్దు చేయాలి. అంతటా ఒకే రేటు కాకుండా పాత పద్ధతినే కొనసాగించాలని టిఎఫ్‌సీసీ తరపున తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి, దీనిపై చర్చిస్తాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం సహకారంతో అవార్డ్స్ కూడా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాం. చిన్న నిర్మాతలను దష్టిలో పెట్టుకుని, మాట్లాడే పెద్ద నిర్మాతలు ఒక్కరూ లేరు. రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు వేల థియేటర్స్ వరకు వాళ్లవే. ఇక్కడ లీజ్‌కి తీసుకునేది కూడా వాళ్లే. టికెట్ రేట్లు పెంచుకున్నప్పుడు థియేటర్ రెంట్లు కూడా పెంచాలి. కానీ పెంచడంలేదు. దీని వల్ల ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు. సినిమా థియేటర్స్ యాజమాన్యాన్ని, ప్రభుత్వాలను కూడా పెద్ద నిర్మాతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై పునరాలోచించాలి. సినిమా ఇండిస్టీ అనేది ఆ నలుగురుది మాత్రమే కాదు. చిన్న నిర్మాతలు, చిన్న హీరోలది కూడా. ఆ నలుగరైదుగురు దోపిడీ వల్ల చిన్న నిర్మాతలు, చిన్న హీరోలు మునిగిపోతున్నారు. టికెట్ విధానం, లీజు సిస్టమ్‌ని ఇంకా కొనసాగించడం ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పెద్దవాళ్ల దోపిడి. దీన్ని కచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం' అని చెప్పారు.