Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశిష్ (నిర్మాత శిరీష్ తనయుడు) హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్, శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'రౌడీ బార్సు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మీడియాతో మాట్లాడుతూ,
''హుషారు' సక్సెస్ తర్వాత దిల్ రాజుగారు కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఏదైనా కథ ఉందా? అని అడిగితే, 'రౌడీబార్సు' కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి, ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కథ మొత్తం పూర్తయ్యాక ఇందులో హీరోగా శిరీష్ తనయుడు ఆశిష్‌ని తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ చూసి 'ప్రేమ దేశం' చిత్రానికి దీనికి సంబంధం ఉందా? అని చాలా మంది అడుగుతున్నారు. దానికి దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు. నా లైఫ్‌లో, అలాగే మా కాలేజ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని రాసుకున్న కథ ఇది. 17-18 ఏళ్ల వయసున్నప్పుడు మెచ్చ్యూరిటీ ఉండదు. అప్పుడు చేసే చాలా పనులు సిల్లీగానే కాకుండా చాలా వైల్డ్‌గా ఉంటాయి. ఓ ఏజ్ వచ్చిన తర్వాత వీటిని మనమే చేశామా అనిపిస్తుంది. దీన్నే సినిమాలో చూపించా. ముఖ్యంగా అమ్మాయిల గురించి చేసిన సినిమా ఇది. అందుకే ఈ సినిమా అబ్బాయిల కంటే అమ్మాయిలకే బాగా నచ్చుతుంది. అలాగే ప్రతి ఒక్కరికీ వాళ్ళ కాలేజీ రోజుల్ని మరోసారి గుర్తు చేసే సినిమా కూడా. ఇందులో ఆశిష్ చాలా బాగా యాక్టింగ్, డాన్సులు చేశాడు. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లందరూ అదే అన్నారు. తనకి ఇది ఫస్ట్ సినిమా అని అనిపించదు. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న యాక్టర్లా చేశాడు. ఇక మా చిత్రానికి మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రాఫర్ మదిగారు. ఆయన పెద్ద సినిమాలకు వర్క్ చేశారు. స్క్రిప్ట్ మీద కూడా మంచి పట్టుంది. ఆయనతో పాటు రాజీవన్‌గారు, దేవిశ్రీ ప్రసాద్‌గారు .. ఇలా అందరూ కాలేజ్ సినిమా చేసి చాలా రోజులైంది. కాబట్టి వాళ్లు కూడా యంగ్ ఫీల్‌తో ఈ సినిమా చేశారు. హీరో ఎంత క్రేజీగా ఉంటాడో, హీరోయిన్ అంత మెచ్చ్యూర్డ్గా ఉండాలి. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించింది. మరో ముఖ్య పాత్రలో విక్రమ్‌ని ఎంపిక చేశాం. వీరితోపాటు ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది' అని తెలిపారు.