Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'అఖండ'. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం థ్యాంక్స్‌మీట్‌ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ,'తెలుగు ప్రేక్షకులు ఈ విజయాన్ని అందించారు. ధైర్యం చేసి రిలీజ్ చేసిన నిర్మాతకు అభినందనలు. ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అయింది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. పాకిస్థాన్‌లో కూడా మాట్లాడుకుంటున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్‌కు మంచి పాత్రలు వచ్చాయి. మా కెమెరామెన్ రెండు పాత్రలను ఎంతో అద్భుతంగా చూపించారు. తమన్ ఎక్స్‌లెంట్ మ్యూజిక్ అందించారు. మా ఫైట్ మాస్టర్లు అదిరిపోయేలా ఫైట్లని కంపోజ్ చేశారు. ఎవరేం చేసినా కూడా వారందరితో చేయించింది మాత్రం బోయపాటి గారే. ఆయన దేశం గర్వించదగ్గ దర్శకుడు' అని చెప్పారు. 'డిస్ట్రిబ్యూటర్లందరికీ మంచి విజయాన్ని ఇవ్వాలనుకున్నాను. అది ఈ సినిమాతో తీరింది. కష్టకాలంలో 'అఖండ' విడుదలైంది. అందరూ కలిసి విజయాన్ని అందించారు. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్' అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, 'ఇది డబుల్ సక్సెస్ మీట్. బ్లాక్ బస్టర్, హిట్, జాతర అని అంటున్నారు. అన్నింటికంటే ఇది ఎక్కువ. డబ్బు రావడం వేరు. ధైర్యం రావడం వేరు. ఈ సినిమాతో అందరికీ ధైర్యం వచ్చింది. ఇలాంటి చిత్రాలు రావడం చాలా అరుదు' అని తెలిపారు. శ్రీకాంత్, అయ్యప్ప శర్మ, డీఓపీ రామ్ ప్రసాద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని తమ విజయానందాన్ని షేర్ చేసుకున్నారు.