Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ యువ కథానాయకుడు శివకార్తికేయన్‌తో అగ్ర నటుడు కమల్ హాసన్ ఓ సినిమా చేయబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా పతాకాలపై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి కథ అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, 'చక్కటి కథ, కథనంతో మా బ్యానర్‌లో 51వ చిత్రంగా దీన్ని తెరకెక్కించబోతున్నాం. ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది. సోనీ పిక్చర్స్‌తో పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది' అని తెలిపారు. ''కమల్‌హాసన్ వంటి దిగ్గజంతో కలిసి తమిళనాట మా కొత్త ప్రయాణాన్ని ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది' అని సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కష్ణ అన్నారు.
'నా అభిమాన నటుడు కమల్‌హాసన్ సంస్థలో, నా చిన్ననాటి స్నేహితుడు శివకార్తికేయన్‌తో ఈ సినిమా చేయటం ఓ విశేషమైతే, సోనీ సంస్థలో ఈ సినిమా రూపొందడం మరో విశేషం' అని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి చెప్పారు. హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ, 'కమల్ హాసన్ వంటి లెజెండ్ నిర్మాతగా ఈ సినిమా చేయటంతోపాటు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్రాండ్ పేరు నా కెరీర్‌లో మరో మైలురాయిలా నిలుస్తుంది. నా స్నేహితుడు, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి నెరేట్ చేసిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా' అని తెలిపారు.