Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, కవిత శ్రీరంగం, అనన్య ప్రాణిగ్రహీ, ఆర్యన్ గౌర, జాన్ కుషాల్, రాకెట్ రాఘవ, జబర్ధస్త్ రాము, మణిచందన తదితరులు నటించిన చిత్రం 'వధుకట్నం'. భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. షేక్ బాబు సాహేబ్ (బాబుషా) నిర్మించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత షేక్ బాబు సాహేబ్ (బాబుషా) మాట్లాడుతూ, 'నా స్నేహితుడు భార్గవని దర్శకుడ్ని చేయటానికి నేను ఈ సినిమా నిర్మించాను. ఓ మనిషిగా నేనెప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తాను. ఆ ఆలోచనల నుంచి పుట్టిన పాయింటే ఈ సినిమా. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియగానే, చంపేస్తున్నారు. ఇలా చంపుకుంటూ పోతే ఇక ఆడపిల్లలు ఎక్కడ్నుంచి వస్తారు?, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. అవుట్‌ఫుట్ బాగా వచ్చింది. ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత ఉందని ఈ సినిమాలో చెప్పాం. ఇందులోని వినోదంతోపాటు పాటలూ అందర్నీ అలరిస్తాయి' అని తెలిపారు.
'భ్రూణ హత్యల వల్ల ఆడపిల్లల శాతం తగ్గి, వారికి డిమాండ్ పెరిగితే అనే కోణాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా చూపించాం. ఇందులోని ప్రతి పాయింట్ నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. నన్ను దర్శకుడిగా పరిచయం చేసేందుకు మా నిర్మాత ఈ సినిమా నిర్మించినందుకు ధన్యవాదాలు. రెగ్యులర్ సినిమాలు, కథలకు పూర్తిగా భిన్నంగా మా సినిమా ఉంటుంది. ఓ మంచి సినిమా తీశామనే గర్వంగా ఉంది' అని దర్శకుడు భార్గవ గొట్టిముక్కల చెప్పారు.
'ఆద్యంతం నవ్విస్తూనే, ఆలోచింపజేసేలా ఉన్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం' అని డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర అన్నారు.