Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన నాపై చూపించిన శ్రద్ధ నన్నెంతో కదిలించింది' అని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అన్నారు.
గత ఏడాది నవంబర్లో తీవ్ర అనారోగ్యానికి గురై అపోలో హాస్పిటల్లో చేరిన కైకాల సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ లేఖ రాశారు.
'నేను హాస్పిటల్లో చేరిన దగ్గర్నుంచి నా ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ నాకు, నా కుటుంబానికి ఎంతో అండగా నిలిచారు. బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయంగా అందిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, మీరు చూపిన శ్రద్ధ పట్ల నాకు చాలా సంతోషం కలిగింది. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో పాటు అన్ని రకాలుగా అండగా నిలిచారు. ఆ కష్ట సమయంలో మీరు అందించిన సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది. మీరు చూపిన ఈ శ్రద్ధ కళాకారుల పట్ల, వారి శ్రేయస్సు పట్ల మీకున్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది' అని కైకాల ఆ లేఖలో పేర్కొన్నారు.