Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాత సుప్రియ యార్లగడ్డ
స్పోర్ట్స్ డ్రామా జోనర్లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ 'లూజర్' వీక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ హిట్ సిరీస్ సీక్వెల్ 'లూజర్ 2' నేటి (శుక్రవారం) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రియదర్శి, ధన్యా బాలకష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.
తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. అయితే 'లూజర్ 2'కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్ కూడా కావడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్వర్క్క్ సంయుక్తంగా ఈ సిరీస్‌ని నిర్మించాయి.
ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సిరీస్ గురించి నిర్మాత సుప్రియ యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ, 'అన్నపూర్ణ స్టూడియోస్ స్కూల్ స్టూడెంట్సే దీనికి పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాకి, ఓటీటీ కథలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓటీటీలో చిన్న పాత్ర అయినా చాలా డిటైల్డ్‌గా రాయాలి. దర్శకుడు అభిలాష్ స్పోర్ట్స్ ఫీల్డ్‌లో సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి చెప్పారు. ఇలాంటి కథలు ఎక్కడా చెప్పలేం. ఓటీటీలోనే చెప్పగలం. అందుకు జీటీవీ వారు మమ్మల్ని నమ్మడం, అందుకు అనుగుణంగా తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడొస్తున్న కొత్తతరంలో టాలెంట్ బాగుంది. 'లూజర్' మాదిరిగానే 'లూజర్ 2' కూడా అందర్నీ విశేషంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.
'సినిమాలు చేసినా ఓటీటీలో చేయడం మాత్రం థ్రిల్ ఇచ్చింది. 'లూజర్2' సిరీస్ నాకు బాగా నచ్చిన కథ. ఇందులో చాలా మంది జీవితాలు మన కళ్ళముందు కనిపించేలా ఉంటాయి' అని నటుటు వెంకట్ అన్నారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ,'ఇది చాలా ఇష్టపడి చేసిన కథ. పీరియాటిక్ కథతో కూడుకున్నది. ఈ కథకు భరత్, శ్రవణ్ ఇద్దరూ రైటింగ్‌లో ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే మాకు సపోర్ట్‌గా నిలుస్తూ మంచి సూచనలు సుప్రియ గారు ఇచ్చారు' అని తెలిపారు. ప్రియదర్శి, శశాంక్ హర్షిత్, పావని, కల్పిక, గాయత్రితోపాటు సాంకేతిక బృందం కూడా మీడియా సమావేశంలో పాల్గొని 'లూజర్ 2' సిరీస్ విశేషాలను షేర్ చేసుకోవడంతోపాటు విజయాన్ని ఆకాంక్షించారు.