Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన 'అఖండ' చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో 103 కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజుల్ని పూర్తి చేసుకుని, శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.
ఈ నేపథ్యంలో అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ఈ చిత్ర అర్థ శతదినోత్సవ వేడుకను గురువారం సాయంత్రం మెయిన్ థియేటర్ సుదర్శన్ 35.ఎం.ఎం.లో చిత్ర బృందం వైభవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా బాలకష్ణ మాట్లాడుతూ, 'ఆర్.టి.సి. క్రాస్ రోడ్‌కి వస్తుంటే మా రామకష్ణ స్టూడియో జ్ఞాపకాలు, 'సమరసింహారెడ్డి' శతదినోత్స వేడుక గుర్తొచ్చాయి. 'అఖండ' విజయం ప్రేక్షకులు ఇచ్చిన విజయం. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. అఖండ అర్థ శతదినోత్సవ పండగని ఆంధ్ర, తెలంగాణలోనే కాదు.. కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా.. ఒక్కచోట కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు జరుపుకుంటున్నందుకు గర్వంగా ఉంది. బోయపాటి శ్రీను, నా కాంబినేషన్లో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. మా కలయిక జన్మజన్మలది. ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలిపాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. తమన్ సంగీతం ఈ చిత్రాన్ని అదరగొట్టేలా చేసింది. ఇందులో నేను పోషించిన శివుడి పాత్ర కోసం నాన్నగారినే స్ఫూర్తిగా తీసుకున్నా. ఆయన ఆశీస్సులు, అభిమానుల ఆదరణతో మంచి విజయం లభించినందుకు హ్యాపీగా ఉంది' అని చెప్పారు. 'మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఈ విజయం నందమూరి అభిమానులది. తెలుగు ప్రేక్షకులది. తెలుగు పరిశ్రమది. ఈ విజయాన్ని ఎన్టీఆర్‌గారికి అంకితమిస్తున్నాం' అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.
'నందమూరి అభిమానులు, ప్రేక్షకులందరూ తమ అభిమానాన్ని యాభైరోజులు ఏకధాటిగా చూపించి మా చిత్రానికి అఖండ విజయాన్ని చేకూర్చారు' అని నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి అన్నారు.
నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్న ఈ అర్థశతదినోత్సవ వేడుకలో అర్థశతదినోత్సవ జ్ఞాపికలను ఎగ్జిబిటర్లకు, పంపిణీదారులకు బాలకృష్ణ అందజేశారు.