Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ క్షేమంగానే ఉన్నారు. చికిత్సకు ఆమె చాలా మెరుగ్గా స్పందిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆమె ఆర్యోగం గురించి పలు రకాల వదంతులు రావడం బాధాకరం. ఇలాంటి వదంతులను ప్రచారం చేయకండి అంటూ కేంద్రమంత్రి స్పృతి ఇరానీ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో లతా మంగేష్కర్ ముంబైలోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఓ పక్క కరోనా వైరస్, మరో పక్క వయసు రీత్యా ఉన్న అనారోగ్య సమస్యల వల్ల లతామంగేష్కర్ను ఐసియులో ఉంచి, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో పలు రకాల వదంతులు షికార్లు చేస్తూ, గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీంతో వీటిపై అటు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు, ఆమెకు వైద్యం అందిస్తున్న బృందంతోపాటు కేంద్రమంత్రి స్పృతి ఇరానీ సైతం ఇలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని కోరారు.
'వదంతులు వ్యాప్తి చేయవద్దని లతా దీదీ కుటుంబ సభ్యులు అందర్నీ అభ్యర్థిస్తున్నారు. ఆమె చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. అన్నీ సహకరిస్తే త్వరలోనే ఇంటికి తిరిగొస్తారు. ఈ సమయంలో లతా కుటుంబానికి మనం అండగా నిలబడాలి. వదంతులకు దూరంగా ఉండండి. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి' అంటూ ట్విట్టర్ వేదికగా స్పృతి ఇరానీ తెలిపారు.