Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జెంటిల్‌మేన్'.. విశేష ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించిన సినిమా. తమిళంతోపాటు తెలుగులోనూ కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా. ఈ సినిమాతోనే శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు అగ్ర నిర్మాత కె.టి.కుంజుమన్. అర్జున్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అవినీతి రాజకీయ నాయకులు, భారతదేశంలోని విద్యా వ్యవస్థలోని లోపాలపై తెరకెక్కింది. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి వేరే టీమ్‌తో సీక్వెల్ చేసేందుకు నిర్మాత కుంజుమన్ సన్నాహాలు ఆరంభించారు. సినిమా పబ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరొందిన ఆయన తన జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీని కోసం ఇటీవల ట్విట్టర్లో ఒక కాంటెస్ట్‌ను కూడా నిర్వహించారు. జీ2 మ్యూజిక్ డైరెక్టర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సీక్వెల్‌కి సంగీతం అందించబోతున్న లెజెండరీ సంగీత దర్శకుడిని ఊహించిన ముగ్గురు విజేతలకు, ఒక్కొక్క బంగారు నాణేం బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ కాంటెస్ట్ ఫలితాన్ని ఆదివారం ఆయన రివీల్ చేశారు. 'జెంటిన్‌మేన్ 2' సినిమాకు సంగీత దర్శకుడిగా స్వరవాణి కీరవాణి పనిచేస్తున్నారని ప్రకటించారు.
'భారతీయ సినిమా ఐకానిక్ లెజెండ్ ఎం.ఎం. కీరవాణి గారు.. నా జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తున్న 'జెంటిల్ మేన్ 2' చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారని నేను గర్వంగా ప్రకటిస్తున్నాను. త్వరలోనే బంగారు నాణేల విజేతలను కూడా ప్రకటిస్తాను' అని ట్విట్టర్లో నిర్మాత కుంజుమన్ పేర్కొన్నారు.
'జెంటిల్ మేన్', 'కాదలన్' (ప్రేమికుడు), 'కాదల్ దేశం' (ప్రేమదేశం) వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో అగ్ర నిర్మాతగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగానూ పేరొందిన కుంజుమన్ 'జెంటిల్‌మేన్ 2' ఎనౌన్స్మెంట్తో మరోసారి అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేయటం విశేషం.