Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ట్ లుక్తో సినిమా మీద మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. శర్వానంద్, రష్మిక జోడికి మంచి మార్కులు పడ్డాయి. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటించారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే చిత్రమని టైటిలే తెలియజేస్తోంది. అయితే ఈ టైటిల్ జస్టిఫికేషన్ని ఎలా చేశారనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్గా ఉంటుంది' అని తెలిపింది.
వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, కొరియోగ్రాఫర్స్ : రాజు సుందరం, శేఖర్ వీ.జే.