Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని వర్గాల ప్రేక్షకులను 'డిజె టిల్లు' సినిమా అమితంగా ఆకట్టుకుంటుందని యువ నాయిక నేహా శెట్టి చెప్పారు. ఆమె రాధిక పాత్రలో నటించిన 'డిజె టిల్లు' ఈనెల 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించింది. విమల్ కష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. శుక్రవారం ఈ సినిమా గురించి నాయిక నేహాశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
ఫస్ట్ మోడలింగ్ చేశా. మలయాళంలో 'ముంగారమళై 2' విడుదలైన తర్వాత తెలుగులో పూరీ జగన్నాథ్ 'మెహబూబా' చేశా. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్' చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇక 'డిజె టిల్లు'తో ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా.
సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి ప్రముఖ సంస్థలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మంచి కంటెంట్ ఉన్న కథతోపాటు క్రియేటీవ్ దర్శకుడు విమల్‌తో పని చేయటం చాలా హ్యాపీగా అనిపించింది.
ఈ సినిమా ట్రైలర్ చూసి ఇదొక రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఫుల్ ప్యాకేజ్. ఇందులో ఉన్న కామెడీ, థ్రిల్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ అన్నీ అందర్నీ అలరిస్తాయి.
ఈ సినిమాలో రాధిక పాత్రలో నటించా. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధిక ఆప్టే అని పిలుస్తున్నారు. రాధిక ఈతరం అమ్మాయి. నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. తను కరెక్ట్ అనుకున్న పనిని చేసేస్తుంది. ఎవరేం అనుకుంటారు అనేదాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది. తప్పును తప్పులా, ఒప్పును ఒప్పుగా చెబుతుంది. ఇలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పాత్ర నాది. రాధికలా నేను వెంటనే మారిపోయాను. దీనికి కారణం ఈ పాత్ర నా జీవితానికి దగ్గరగా ఉండటమే.
దర్శకుడు విమల్ ఈ కథ చెప్పినప్పుడు, బాగా నవ్వుకున్నాను. నేను తెలంగాణ యాస వినటం చాలా కొత్త. ఈ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. హీరోను రాధిక కన్ఫ్యూజ్ చేసినట్లు ట్రైలర్లో చూపించాం. రాధిక ఏం చేసినా, దానికో కారణం ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది.
సిద్ధు టాలెంటెట్ యాక్టర్. రచయిత, గాయకుడు కూడా. తన నుంచి నటనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను, సిద్దు, విమల్, బ్రహ్మాజీ, ప్రిన్స్ మేమంతా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. పాండమిక్ వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యాం, బాధపడ్డాం. ఈ సినిమా చూస్తే ఆ ఒత్తిడినంతా నవ్వుతూ మర్చిపోతారని కచ్చితంగా చెప్పగలను.